
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను 2022–23 సంవత్సరంలోనూ ఏపీ, తెలంగాణకు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో పాత విధానంలోనే నీటి పంపిణీకి అంగీకరించిన తెలంగాణ సర్కారు.. ఆ తర్వాత అడ్డం తిరిగి సగం వాటా కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ స్పష్టతనిచ్చింది.
2015 జూన్ 19న రెండు రాష్ట్రాల అంగీకారంతో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేసేలా తాత్కాలిక సర్దుబాటు చేశామని పేర్కొంది. 2016–17లో ఇదే విధానానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది. 2017 నుంచి 2022 వరకు ఇదే విధానంలో నీటిని వినియోగించుకున్నాయని గుర్తు చేసింది.
ఈ నీటి సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకూ ఈ విధానంలోనే రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసినట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి.