
త్వరలో ఇక్కడ టీ20 మ్యాచ్‌ల నిర్వహణ
ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కూడా..
విశాఖ స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య విశాఖపట్నం వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో సోమవారం జరగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ను గవర్నర్ అబ్దుల్ నజీర్ వీక్షించనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఇక్కడ జరగనున్న ఈ తొలి మ్యాచ్ నేపథ్యంలో.. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎంపీ కేశినాని శివనాథ్ (చిన్ని) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రారంభ మ్యాచ్‌ను వీక్షించేందుకు ముఖ్యమంత్రిని ఆహ్వానించగా పలు కార్యక్రమాలవల్ల ఆయన రావట్లేదని.. కానీ, గవర్నర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు.
మరోవైపు.. ఉమెన్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు విశాఖ అతిథ్యమివ్వనుందని, అయితే.. బీసీసీఐ నుంచి ఇంకా వివరాలు అందాల్సి వుందన్నారు. త్వరలోనే టీ20 మ్యాచ్‌ల్ని కూడా విశాఖలో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇక విజయవాడలో అతిపెద్ద స్టేడియం నిర్మాణం అసంభవమని.. మోదీ స్టేడియంని మించి స్టేడియం కట్టడం సాధ్యపడే విషయం కాదని కేశినేని తేల్చిచెప్పారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో భాగంగా స్టేడియం నిర్మిస్తామని చెప్పారు.
మంగళగిరి స్టేడియం కన్‌స్ట్రక్టింగ్ స్ట్రక్చర్లు పాడవడంతో కొన్ని స్టాండ్స్‌ను తొలగించాల్సి వస్తోందన్నారు. స్టేడియంను రంజీ మ్యాచ్‌లు, అకాడమి అవసరాలకే తప్ప అంతర్జాతీయ మ్యాచ్‌లకు వాడలేమన్నారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ..
ఏపీఎల్ నాలుగో సీజన్‌ను కొనసాగిస్తామన్నారు. మరింత మెరుగ్గా నిర్వహించేందుకు విధివిధానాలు మారుస్తున్నామని తెలిపారు. గవర్నింగ్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయని.. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తామన్నారు.