
సాక్షి, అమరావతి: విస్తరణ, పునరుద్ధరణ, ఆధునికీకరణ (ఈఆర్‌ఎం) పథకం ముసుగులో నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి అక్రమంగా 15–20 టీఎంసీల కృష్ణాజలాలను అదనంగా తరలించడానికి కర్ణాటక సిద్ధమైంది. 2018–19 ధరల ప్రకారం రూ.2,794 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ఆధునికీకరణ పనులు చేపట్టడానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక (పీపీఆర్)ను శుక్రవారం కర్ణాటక జలవనరులశాఖ సీఈ ఎస్.రంగారాం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) సమర్పించారు. ఇప్పటికే అప్పర్ కృష్ణా మూడోదశ ద్వారా 130, అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలు వెరసి 159.90 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవడానికి సిద్ధమైన కర్ణాటక.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా 15 నుంచి 20 టీఎంసీలను మళ్లించేందుకు శ్రీకారం చుట్టడం గమనార్హం.
ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సంవత్సరాల్లో దిగువ కృష్ణా బేసిన్‌లోని తెలుగు రాష్ట్రాలకు సాగునీటి మాట దేవుడెరుగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి లభ్యతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఏకపక్షంగా సాంకేతిక అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పర్ కృష్ణా మూడోదశతోపాటు తాజాగా కర్ణాటక చేపట్టిన నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ఆధునికీకరణ పనులకు సాంకేతిక అనుమతి ఇచ్చే విషయంలో సీడబ్ల్యూసీ నిబంధనల మేరకు వ్యవహరిస్తుందా, లేదా.. అన్నది తేలాల్సి ఉంది.
అదనంగా 1.49 లక్షల ఎకరాల ఆయకట్టు
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు తొలి, రెండోదశల కింద నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కర్ణాటక ఇప్పటికే 22.40 టీఎంసీలను తరలిస్తూ రాయచూర్ జిల్లాలో 2,07,564 ఎకరాలకు నీళ్లందిస్తోంది. తాజాగా ఈ కాలువను ఈఆర్‌ఎం పథకం కింద ఆధునికీకరించడం ద్వారా 3,56,882 ఎకరాలకు నీళ్లందించడానికి పీపీఆర్‌ను రూపొందించింది. రూ.2,794 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అంటే నారాయణపూర్ కుడికాలువ ఆధునికీకరణ ముసుగులో కొత్తగా 1,49,318 ఎకరాలకు నీళ్లందించడానికి కర్ణాటక ప్రణాళిక రచించింది. ఇందుకు అదనంగా 15 నుంచి 20 టీఎంసీలు తరలించడానికి సిద్ధమవడం గమనార్హం.
కేటాయింపులకు మించి వినియోగం
కృష్ణాజలాల్లో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. ఇప్పటికే కేటాయింపులకు మించి కర్ణాటక కృష్ణాజలాలను ఉపయోగించుకుంటోంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతానికి, 65 శాతానికి మధ్యన లభ్యతగా ఉన్న 448 టీఎంసీల జలాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది.
ఇందులో కర్ణాటక వాటా 177 టీఎంసీలు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఇప్పటివరకు కేంద్రం నోటిఫై చేయలేదు. కానీ.. కర్ణాటకకు ఉన్న కేటాయింపులు, వినియోగం, లభ్యత, మిగిలిన జలాలను ఏమాత్రం లెక్కించకుండా.. అంతరాష్ట్ర నదీజల వివాదాల చట్టాన్ని తుంగలో తొక్కి.. దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పర్ భద్రకు సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి ఇచ్చింది. నాలుగు నెలల కిందట అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ అప్పర్ కృష్ణా మూడోదశ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించిన కర్ణాటక.. తాజాగా నారాయణపూర్ రిజర్వాయర్ కుడికాలువ విస్తరణ పీపీఆర్‌ను సమర్పించింది.