
సాక్షి, అమరావతి: ► విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి గత నెల 30న సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారనగా దానికి ఒక్కరోజు ముందే రామతీర్థం ఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా 29న సదరు ఆలయంలో సీసీ కెమెరాను ఏర్పాటుచేస్తారనగా 28వ తేదీ రాత్రే రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
► అలాగే, రామతీర్థం వివాదాన్ని విపక్షాలు రాజేసిన మరుక్షణమే కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం వద్ద పొలాల్లోని ఆంజనేయస్వామి ఆలయంపైనున్న విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్రమత్తమైన కర్నూలు జి ల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తే అసలు విగ్రహ ధ్వంసమే జరగలేదని తేలింది. ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించిన ఎస్పీ.. తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావా లతో చెలగాటమాడితే శిక్ష తప్పదని శనివారం హెచ్చరించారు.
రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న ఈ రెండు ఘటనలను గమనిస్తే ఆలయాల మాటున అలజడులు సృష్టించే కుట్ర బట్టబయలవుతోంది. పథకం ప్రకారమే దేవాలయాల్లో ఘటనలు జరుగుతున్నట్లు సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజలూ ఇదే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీంతో రామతీర్థం ఘటన ద్వారా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి విధ్వంసం చేసే కుట్ర కోణంపైన పోలీసులు దృష్టిసారించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అశోకగజపతిరాజు చైర్మన్‌గా ఉన్న ఈ రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలిని పరిశీలించారు. డీఐజీ కేఎల్ రంగారావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు నిఘా పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల లెక్కలు తేల్చి వాటి వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టడమే కాక గత కొంతకాలంగా ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆయన పాలనలో ఆలయాల్లో నేరాలకూ లెక్కలేదు.
తప్పుడు ప్రచారాల వెనుక వాస్తవాలివే..
మరోవైపు.. రామతీర్థం ఘటన నేపథ్యంలో డీజీపీ కార్యాలయం స్పందించింది. ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి..
► కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి. వాస్తవానికి మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్టుచేశారు.
► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాలు చోరీ అవుతున్నాయంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి రాజశేఖర్ అనే వ్యక్తి సంతానం కోసమే విగ్రహ భాగం చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
► అలాగే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సరస్వతీదేవి విగ్రహ విధ్వంసంపై అన్యమతాల వారే చేశారంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. వాస్తవానికి సరస్వతీదేవీ విగ్రహాన్ని ఎవరూ విధ్వంసం చేయలేదని గుర్తించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు.
ఆలయాల విషయంలో పోలీస్ శాఖ చర్యలివీ..
► రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.
► ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు.
► దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు.
► రాష్ట్రంలోని అన్ని ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీసులు అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతా పరమైన చర్యలు చేపట్టారు.
ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు : డీజీపీ
వాస్తవాలను నిర్ధారించుకోకుండా మతాలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు. రాష్ట్రంలో ఏ ప్రార్థనా మందిరం వద్ద అయినా చిన్నపాటి ఘటన జరిగినా బాధ్యులను గుర్తిస్తున్నాం. ఇదే సమయంలో మతపరమైన అంశాలను వివాదం చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. అంతర్వేది రథం దగ్థం ఘటన అనంతరం రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టాం. అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టుచేశాం. ఇప్పటివరకు అన్ని మతాల ఆలయాలు, సంస్థలకు సంబంధించి 57,493 ప్రాంతాలకు జియో ట్యాగింగ్ చేశాం. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం.
– డీజీపీ గౌతం సవాంగ్