
సాక్షి, అనంతపురం: ఏపీలో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదంలో చిక్కుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం విషయంలో జయరాం తనను మోసం చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం..‘గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన బోలే యల్లప్ప ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. యల్లప్ప ఆత్మహత్యయత్నం చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కారణమని అన్నారు. ఎమ్మెల్యే జయరాం.. యల్లప్ప నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగాన్ని 8 లక్షలకు మరొకరికి ఇచ్చేశారు. ఈ కారణంగా ఉద్యోగం పోయిందనే ఆవేదనతో యల్లప్ప ఇలా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో జయరాం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు.
