
విశాఖ, అనంతపురం నగరాల్లో కదం తొక్కిన ముస్లింలు
సీతమ్మధార(విశాఖ)/అనంతపురం కార్పొరేషన్: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విశాఖపట్నం, అనంతపురం నగరాల్లో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని డాబా గార్డెన్స్ ఎల్‌ఐసీ బిల్డింగ్ వద్ద గల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది మహమ్మద్ గౌస్ ముద్దిన్ ఖాన్ మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల మత, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం ఉందని చెప్పారు.
వక్ఫ్ సవరణ చట్టం అనేది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా మైనారిటీల మతపరమైన హక్కులకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లిం నాయకులు హైదర్ అలీ సింకా, జహీర్ అహ్మద్, అహ్మదుల్లా ఖాన్, మునీర్, మహమ్మద్ ఇబ్రహీం, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఫారూఖి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో...
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలని అనంతపురంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది ముస్లిం మైనారిటీలు పాల్గొన్నారు.వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతపురం నగర మేయర్ వసీం, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అవకాశ లౌకికవాది చంద్రబాబు
»ఆయనకు సిద్ధాంతాలు, విలువలు లేవు
»2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని ఉగ్రవాది
»అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు
»బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా లౌకిక వాదానికి అర్థం మారుస్తారు
»వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు
» ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్
సాక్షి, అమరావతి:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు తప్ప సిద్ధాంతాలు, విలువలు లేవని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. తన యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా ఈ మేరకు వీడియో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. ‘2019 ఎన్నికల్లో బీజేపీపై ఆధారపడే అవసరం లేదని, మతతత్వ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి
నరేంద్రమోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. రాజకీయ మనుగడ మాత్రమే చంద్రబాబు ఏకైక ప్రాధాన్యత.
లౌకిక వాదం విషయంలోనూ ఆయన అంతే. తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి దానిని ఒక కళారూపంగా మార్చుకున్నారు. లౌకిక వాదానికి అర్థం చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా మారిపోతుంది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా.. వారి పదవులు కాపాడుకునే అంశంగా లౌకిక వాదాన్ని చంద్రబాబు మార్చేశారు.
అవకాశ లౌకిక వాదిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. లౌకిక వాదానికి, మత స్వేచ్ఛకు భంగం కలిగించే వివాదాస్పద వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీజేపీకి దృఢమైన మద్దతుదారుగా చంద్రబాబు నిలబడ్డారు. బిల్లులో కొన్ని సవరణలు సూచించడం ద్వారా ముస్లిం సమాజానికి తాము మంచి చేశామని చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ చెప్పుకున్నారు. చంద్రబాబుది ట్రికీ కేస్‌స్టడీ. రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగడానికి ఎన్ని రంగులు మార్చడానికైనా ఆయన వెనకాడరు.
లౌకిక వాదం విషయంలో ఆయన విధానం ఎప్పుడూ ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో నిబద్ధత స్థానంలో అవకాశ వాదం, అవసరం వచ్చి చేరాయి. రాజకీయ విధానాల్లో నిబద్ధత అత్యంత ముఖ్యమనే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. వారు అనుభవించే పదవులను బట్టి లౌకిక వాదానికి అర్థం మారిపోతుంది’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు.