తక్షణమే తప్పుకోండి.. Education Minister Lokesh ultimatum to varsity VCs | Sakshi
Sakshi News home page

తక్షణమే తప్పుకోండి..

Published Sat, Jun 29 2024 5:35 AM | Last Updated on Sat, Jun 29 2024 5:35 AM

Education Minister Lokesh ultimatum to varsity VCs

వర్సిటీ వీసీలకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అల్టిమేటం

మంత్రి పీఏ నుంచి నేరుగా రిజిస్ట్రార్‌లకు ఫోన్‌ ద్వారా సమాచారం

జేఎన్‌టీయూ (ఏ), ఎస్కేయూ, ఏయూ, కృష్ణా, ద్రవిడ వర్సిటీల 

వీసీలూ, రిజిస్ట్రార్లు రాజీనామా

ప్రజా వ్యతిరేక టీడీపీ మార్క్‌ పాలన ప్రారంభమైందని విద్యావేత్తల ఆవేదన

అనంతపురం/విశాఖ సిటీ/గుడుపల్లె (చిత్తూరు జిల్లా)/కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం) : అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్‌ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ పీఏ నుంచి రిజిస్ట్రార్‌లకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్‌లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పారు. 

అధికారికం కాదులే అని ఆగినా..
లోకేశ్‌ పీఏ పేరుతో ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొ­లుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ప్రాంక్‌ కాల్‌చేసి ఉండవచ్చని వీసీలు మిన్నకుండిపోయారు. దీంతో నేరుగా వైస్‌ఛాన్సలర్ల వాట్సాప్‌ గ్రూపులో అధికారికంగా మెసేజ్‌ పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. జేఎన్‌టీయూ (ఏ), ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..

» జేఎన్‌టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శ్రీనివాసరావు గురువారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్‌ ప్రొ. సి.శశిధర్‌ సైతం రిలీవ్‌ అయ్యారు. దీంతో ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణను నియమించిన వీసీ శ్రీనివాసరావు.. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపారు. 
»  అలాగే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. హుస్సేన్‌రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎంవీ లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 
»  ద్రవిడ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్‌ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ వÆటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్‌ ద్వారా గవర్నరుకు పంపించారు. సాయంత్రమే ద్రవిడ వర్సిటీ వదిలి వెళ్లిపోయారు. 
»  అలాగే, కృష్ణా యూనివర్శిటీ వీసీ జి. జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా..
నిజానికి.. జేఎన్‌టీయూ (ఏ)లో అప్పటి వీసీ ప్రొ. శ్రీనివాస్‌కుమార్‌ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. 2019లో రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చినా.. శ్రీనివాస్‌కుమార్‌ను వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్‌ కూడా 2015లో నియమితులైనా.. ఆరేళ్లపాటు చైర్మన్‌ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. 

కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్‌ఛాన్సలర్లనే తప్పుకోమనే సంస్కృతికి తెరతీసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు.

పదవి కోసం వైఎస్సార్‌ విగ్రహం తాకట్టు..
ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో జీవితాలకు బాటలు వేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహాన్ని ఈ ఏడాది ఆరంభంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడో రోజే విగ్రహాన్ని తొలగించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. విగ్రహం తొలగిస్తే మీరు పదవుల్లో కొనసాగుతారని వీసీ, రిజిస్ట్రార్‌లను హెచ్చరించారు. దీంతో వారు 24 గంటల్లో వైఎస్సార్‌ విగ్రహాన్ని అధికారికంగా తొలగించారు. అయినప్పటికీ వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లుచేయడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. జేఎన్‌టీయూ (ఏ)లో అధునాతనంగా నిర్మించిన ఆడిటోరియానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. అక్కడే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సైతం ఏర్పాటుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ర్టంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎన్టీఆర్‌ విగ్రహం ఔన్నత్యాన్ని కాపాడారు. కానీ, టీడీపీ మాత్రం ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.

ఏయూ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా 
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. లేఖను గవర్నర్‌ కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా ఏయూ అకడమిక్‌ డీన్‌గా ఉన్న ప్రొ.కిషోర్‌బాబును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రసాదరెడ్డికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. 

ఒకవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసాదరెడ్డిపై రాజకీయ ఆరోపణలు ఎక్కుపెట్టగా.. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ఫోన్లుచేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చెయ్యకపోతే దాడులకు తెగబడతామని పార్టీ శ్రేణులు సైతం హెచ్చరించాయి. దీనిపై ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, ఏయూలోని వీసీ కార్యాలయం వద్ద నిత్యం నిరసనల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావుడి చేసూ్తనే ఉన్నారు. పలుమార్లు వీసీని అడ్డుకోడానికి ప్రయత్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement