వెంకటాచలం/గుంటూరు (ఏఎన్‌యూ)/కడప (వైవీయూ): కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు శ్రుతిమించాయి. చివరకు ఉన్నత విద్య అందించే విశ్వవిద్యాలయాలపైనా కర్రపెత్తనం ప్రారంభించింది. వర్సిటీల వీసీలను తప్పుకోవాలంటూ బెదిరింపులకు దిగడమేగాక తీవ్ర వేధింపులకు గురిచేస్తుండడంతో తట్టుకోలేక వారు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే పలు వర్సిటీల వీసీలు రాజీనామా చేయగా.. తాజాగా మరికొందరు అదే బాటపట్టారు.
టీడీపీ నేతల వేధింపులను తట్టుకోలేక నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ పి.రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి శుక్రవారం పంపించారు.
ఈ నెల 5న టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు విశ్వవిద్యాలయంలోకి చొరబడి వీసీ, రిజిస్ట్రార్లతో పాటు అధ్యాపక బృందాలపై దాడి చేశారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కాగా.. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేసి వెళ్లిపోవాలని విద్యాశాఖ మంత్రి పీఏ ఫోన్ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారిద్దరూ రాజీనామాలు సమర్పించారు.
అదే బాటలో వైవీయూ వీసీ
కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ చింతా సుధాకర్ గవర్నర్ కార్యాలయానికి రాజీనామా సమర్పించారు. కాగా.. రిజిస్ట్రార్ వైసీ వెంకట సుబ్బయ్య రాజీనామాను వీసీ ఆమోదించారు. టీడీపీకి చెందిన ఓ వ్యక్తి విద్యాశాఖ మంత్రి ఓఎస్‌డీగా తాను చేరబోతున్నానని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్‌లు రాజీనామాలు సమర్పించాలంటూ ఫోన్లు చేశారు.
అనధికార ఓఎస్‌డీ ఫోన్‌కాల్స్ పట్టించుకోవాల్సిన పనిలేదని భావించారు. అయితే, తర్వాత రోజు వీసీల వాట్సా‹³ గ్రూపుల్లో సైతం అందరూ రాజీనామాలు సమర్పించాలని వీసీలు, రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి తోడు అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలను విశ్వవిద్యాలయాలపైకి ఉసిగొల్పి అనవసర రాద్ధాంతం చేస్తూ వచ్చారు.
వైఎస్సార్ వర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామా
కడప నగరంలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (వైఎస్సార్ ఏఎఫ్‌యూ) రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి జూన్ 5న పదవికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీప బంధువు కావడంతో ఈయనపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులను ఉసిగొల్పారు.
తాజాగా శనివారం ఆయన రాజీనామాను ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ బానోతు ఆంజనేయప్రసాద్ ఆమోదించారు. దీంతో ఆయన తిరిగి మాతృవిశ్వవిద్యాలయం వైవీయూలో బయో టెక్నాలజీ ఆచార్యులుగా చేరారు. కాగా.. వైఎస్సార్ ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ బానోతు ఆంజనేయప్రసాద్ సైతం సోమవారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం.
ఏఎన్‌యూ వీసీ రాజీనామాకు నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వీసీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వీసీ పి.రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు రాజీనామా చేస్తున్న తరుణంలో తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు శనివారం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment