
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కిందకు 2024 డిసెంబర్‌లో కొత్తగా 16.05 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. 2024 నవంబర్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం, 2023 డిసెంబర్ గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 2.74 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. నికరంగా చూస్తే 8.47 లక్షల కొత్త చందాదారులు చేరారు. ఇది ఉపాధి అవకాశాల కల్పన పెరుగుదలను సూచిస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.
కొత్త సభ్యుల్లో 4.85 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే కావడం గమనార్హం. నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మేర ఈ వయసు నుంచే ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 15.12 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. 2024 నవంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు వీరి సంఖ్య 5 శాతం పెరిగింది. కొత్త సభ్యుల్లో 2.22 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే మహిళా సభ్యుల చేరికలో 6.34 శాతం వృద్ధి నమోదైంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..
టాప్–5 రాష్ట్రాల నుంచే 60 శాతం
కొత్త సభ్యుల్లో 60 శాతం మంది టాప్ 5 రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఒక్క మహారాష్ట్ర నుంచే 21.71 శాతం మంది ఈపీఎఫ్‌లో చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, యూపీ, తెలంగాణ ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి విడిగా 5 శాతానికి పైనే కొత్త సభ్యులు చేరారు. మానవ వనరుల సరఫరా, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు తదితర ఎక్స్‌పర్ట్‌సరీ్వసెస్ తరఫున 41 శాతం మంది కొత్తగా ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు.