
న్యూఢిల్లీ: స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర బుధవారం రూ. 1,050 మేర క్షీణించింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 90,200కి దిగి వచ్చింది. ఇక 99.5 శాతం స్వచ్ఛత బంగారం కూడా అంతే తగ్గి రూ. 89,750కి పరిమితమైంది.
వెండి ధర మాత్రం కేజీకి రూ. 500 పెరిగి రూ. 93,200కి చేరింది. వాణిజ్య యుద్ధాలు ప్రపంచ ఎకానమీని మాంద్యంలోకి తోసేస్తాయనే భయాలతో అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధర పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయంగా బంగారం రేటు ఒక దశలో ఔన్సుకు (31.1 గ్రాములు) సుమారు 3,103 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా విధించిన 104 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా 84 శాతానికి సుంకాలను పెంచుతామంటూ ప్రకటించడం వాణిజ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. చైనా టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి.