
Joker Virus Apps List 2021: జోకర్ మాల్‌వేర్ మళ్లీ వచ్చేసింది. ప్రమాదకరమైన 'జోకర్' వైరస్ తిరిగి వచ్చినట్లు బెల్జియం పోలీసులు ఇటీవల ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులను హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర వైరస్‌లలో ఒకటైన జోకర్ వైరస్ ఆండ్రాయిడ్ పరికరాలపై దాడి చేసి గూగుల్ ప్లే స్టోర్లలోని వివిధ యాప్స్ లో దాగి ఉంటుంది. ఈ వైరస్ యూజర్ అనుమతి లేకుండానే పేమెంట్ సర్వీసులను సబ్ స్క్రైబ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "గూగుల్ నిషేదించిన ఎనిమిది ప్లే స్టోర్ అప్లికేషన్లలో ఈ హానికరమైన వైరస్ ను గుర్తించినట్లు" బెల్జియన్ పోలీసులు తమ పోర్టల్ లో తెలిపారు.
క్షణాల్లో ఖాతా ఖాళీ
యాదృచ్ఛికంగా, ఈ 8 యాప్స్ ఈ ఏడాది జూన్ లో క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ పరిశోధకులు గుర్తించిన విధంగానే ఉన్నాయి. ఈ మాల్ వేర్ గురించి తెలిసిన తర్వాత గూగుల్ ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుండి తొలగించింది. అయితే, ఆండ్రాయిడ్ వినియోగదారులు వెంటనే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ యాప్స్ తొలిగించాలని పేర్కొంది. బెల్జియన్ అధికారుల ఇటీవలి హెచ్చరిక ప్రకారం.. ఇప్పటికీ ఈ యాప్స్ ఉన్న వినియోగదారులు జోకర్ మాల్వేర్ బాధితులుగా మారుతున్నారు.(చదవండి: ఈ రెండు ఆధార్ సేవలు నిలిపివేసిన యూఐడీఏఐ)
ఈ మాల్‌వేర్ ఒక్కసారి మన ఫోన్‌లోకి వచ్చిదంటే ఇక అంతే సంగతులు..! మీ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారాన్ని హకర్లు డార్క్ వెబ్‌లో అమ్మేస్తారు. అంతేగాకుండా మీ అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో ఖాళీ చేస్తారు. జోకర్ మాల్‌వేర్ తొలిసారిగా 2017 గూగుల్ ప్లేస్టోర్‌లో తొలిసారిగా ప్రత్యక్షమైంది. క్విక్ హీల్ పరిశోధకుల ప్రకారం.. జోకర్ అనేది ఒక మొండి మాల్‌వేర్. యూజర్‌కు తెలియకుండానే రెప్పపాటులో డబ్బులు మాయం చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్‌పై యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ దాడి చేస్తుంది. మెసేజ్‌లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, పేమెంట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతుంది.
8 ఆండ్రాయిడ్ యాప్స్ జాబితా:
- Auxiliary Message
- Element Scanner
- Fast Magic SMS
- Free Cam Scanner
- Go Messages
- Super Message
- Super SMS
- Travel Wallpapers