
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇద్దరు ప్రముఖ భారతీయ వ్యక్తులు మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్ బచ్చన్‌కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రముఖ క్రికెటర్ ధోనికేమో బ్యాంక్ బ్రాండ్‌ను ఎండార్స్ చేస్తున్నందుకు డబ్బు చెల్లిస్తుంటే.. అభిషేక్ బచ్చన్‌కు తన ప్రాపర్టీని బ్యాంకు అద్దెకు తీసుకున్నందుకు చెల్లింపులు చేస్తుంది.
ఎంఎస్ ధోనీతో డీల్
కెప్టెన్ కూల్‌గా పిలవబడే మహేంద్ర సింగ్ ధోనీని ఎస్‌బీఐ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్రికెట్ జట్టులో అసాధారణ నాయకత్వ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన ధోని ఎస్‌బీఐతో కలిసి పనిచేయడం సంస్థ ఉత్పత్తులను, రెవెన్యూ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందని బ్యాంకు నమ్ముతుంది. ధోనీకి తమ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం ఎస్‌బీఐ రూ.ఆరు కోట్లు చెల్లిస్తుంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న చివరి భారత కెప్టెన్‌గా ధోనీకి ఎంతో గుర్తింపు ఉంది. క్రికెట్ అభిమానులను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
అభిషేక్ బచ్చన్‌తో ప్రాపర్టీ లీజు ఒప్పందం
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఎస్‌బీఐ నుంచి ప్రతి నెల రూ.18,00,000 అద్దె పొందుతున్నారు. ముంబయిలోని ప్రముఖులు నివసించే జుహు ప్రాంతాలోని బచ్చన్ కుటుంబానికి చెందిన జుహు బంగ్లాను లీజుకు ఇవ్వడానికి బ్యాంకుతో 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో లీజు ఒప్పందంలో భాగంగా బచ్చన్ కుటుంబానికి స్థిరమైన ఆదాయ సమకూరుతోంది. ఈ ఒప్పందంలో కాలానుగుణ అద్దె పెంపు కోసం క్లాజులు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ విజయవంతమైన నటుడిగానే కాకుండా వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా తన వ్యాపార చతురతను నిరూపించుకున్నారు. జుహు బంగ్లాను ఎస్‌బీఐకు లీజుకు ఇవ్వాలని ఆయన తీసుకున్న నిర్ణయం మెరుగైన ఆర్థిక ప్రణాళికల్లో ఒకటిగా చూస్తున్నారు.