పాడేరులో బస్సు ప్రమాదం | APSRTC Bus Accident In Visakhapatnam Paderu | Sakshi
Sakshi News home page

పాడేరులో బస్సు ప్రమాదం

Published Mon, Aug 21 2023 4:35 AM | Last Updated on Mon, Aug 21 2023 7:09 AM

APSRTC Bus Accident In Visakhapatnam Paderu - Sakshi

ఘటనా స్థలిలో బస్సు

సాక్షి, పాడేరు, పాడేరు రూరల్, సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి లోయలోకి దూసుకు­పోయిన ప్రమాదంలో ఇద్దరు ప్రయా­ణికులు మృతి చెందారు. మరో 28 మందికి గాయా­ల­య్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అక్కడకు చేరుకున్నారు. ఆర్టీసీ, పోలీస్‌ శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారని తెలిపారు.

శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అత్యవసర వైద్యం అవసరమైతే విశాఖ కేజీహెచ్‌ లేదా కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలించాలని, క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సాయం అందించాలని స్పష్టం చేశారు. పాడేరు ఘాట్‌లో ప్రమాదాలు నివారించేందుకు రవాణ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామన్నారు.

ఎలా జరిగింది..?
మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ కాంప్లెక్స్‌ నుంచి ఆర్టీసీ బస్సు(ఏపీ 31జెడ్‌ 0285) పాడేరుకు బయలుదేరింది. ఈ క్రమంలో చోడవరంలో కొంతమంది ప్రయాణికులు ఎక్కారు. మొత్తం 34 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఘాట్‌లోని వ్యూపాయింట్‌ వద్ద మలుపులో రోడ్డు పక్కన చెట్టు కొమ్మలను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పింది.

రక్షణ గోడను ఢీకొట్టి వందడుగుల లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన నరవ నారాయణమ్మ(50), అల్లూరి జల్లా పాడేరు మండలం జి.కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనుడు సీసా కొండన్న(55) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద ఘటనను ప్రత్యక్షంగా చూసిన ద్విచక్రవాహనదారులు గడ్డంగి రమేష్, ఆనంద్, కారులో వెళ్తున్న టి.శేషగిరి లోయలోకి దిగి బాధితులను కాపాడారు. గాయాలపాలైన వారిన రోడ్డుపైకి మోసుకొచ్చి 108 సాయంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. లోయలో బస్సు కింద పడి ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సీఐ సుధాకర్, ఎస్‌ఐ రంజిత్, స్థానికులంతా ఎంతో శ్రమించారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ జిల్లా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

మెడికవర్‌కు తరలింపు
క్షతగాత్రుల్లో కొందరిని మెరుగైన వైద్యం కోసం రాత్రి విశాఖలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో రోలుగుంట మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కిల్లో బోడిరాజు (39), బొట్ట చిన్నమ్ములు (48), బొట్ట దుర్గాభవాణి (14), బొట్ట రామన్న (14), సామర్ల బాబురావు (50) ఉన్నారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నమ్ములుకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. 

మనవడు, మనవరాలిని చూసేందుకు వెళ్లి..
బస్సు ప్రమాదంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నారాయణమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. అనారోగ్యంతో ఉన్న తమ మనవడు, మనవరాలిని చూసేందుకు ఈశ్వరరావు, నారాయణమ్మ దంపతులు ఉదయం 10 గంటల సమయంలో సబ్బవరం వద్ద బస్సు ఎక్కారు.

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కోడలికి ఫోన్‌ చేసి దారిలో ఉన్నట్లు చెప్పారు. అంతలో ప్రమాదం జరగడంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. కళ్ల ముందే భార్య చనిపోవడంతో ఈశ్వరరావు గుండెలవిసేలా రోదించారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లి మృతి చెందిన వార్త తెలియటంతో కుమారులు ప్రసాద్, అర్జునరావు, వెంకట రమణ విషాదంలో కూరుకుపోయారు. 

చెట్టును తప్పించబోయి..
‘వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్‌’ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టు పక్క నుంచి బస్సును పోనిచ్చే క్రమంలో డ్రైవర్‌ అంచనా తప్పింది. బస్సు రోడ్డు అంచు వరకు వెళ్లడంతో వెనుక చక్రాలు రక్షణ గోడను దాటి లోయవైపు జారిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో నేను పాడేరు నుంచి బైకుపై ఘాట్‌ రోడ్డులో దిగువకు వస్తున్నా. ఎదురుగా బస్సును చూసి బైకు పక్కకు తీసి ఆపా.

చెట్టును దాటుకుని వస్తుందనుకున్న బస్సు ఒక్కసారిగా లోయలోకి జారిపోవటాన్ని చూసి చేష్టలుడిగిపోయా! రోడ్డు అంచుకు పరిగెత్తుకుని వెళ్లాం. అన్నీ పరిమి డొంకలు కావడంతో కిందకు వెళ్లడానికి అవకాశం లేదు. తుప్పల్లో పడిపోయి ఒకరు చనిపోగా.. బస్సులో మరొకరు మృతి చెందారు. గాయాలతో బయట పడ్డ వారిని అంతా కలసి 108, ఇతర వాహనాల్లో పాడేరు ఆస్పత్రికి తరలించాం. బస్సులో ఆర్నెళ్ల చిన్నారి కూడా ఉంది. 

కళ్ల ముందే లోయలోకి..
మైదాన ప్రాంతానికి కారులో వెళుతున్నాం. మా కళ్ల ముందే ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకుపోయింది. లోయలోకి దిగి తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను రోడ్డుపైకి మోసుకొచ్చాం. అదే దారిలో వస్తున్న కొందరు వాహనదారులు మాకు సహాయపడ్డారు. ఇద్దరు వృద్ధులు చనిపోయారు. పోలీసులకు సమాచారం అందించి అంబులెన్స్‌లు, 108 వాహనాల్లో గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించాం.
– ప్రత్యక్ష సాక్షులు గడ్డంగి రమేష్‌బాబు, పూజారి ఆనంద్, శేషగిరి

చెట్టు కొమ్మను తప్పించబోయి..
ఘాట్‌లో బస్సును నెమ్మదిగా నడుపుతున్నా. మలుపులో రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్టు కొమ్మను తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పింది. అదే సమయంలో ఓ బైక్‌ ఎదురుగా రావడంతో బస్సు లోయలోకి దూసుకుపోయింది. చెట్టు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దిగువ రోడ్డులో బస్సు బోల్తా కొట్టి ఉంటే ప్రాణనష్టం అధికంగా ఉండేది. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందడం, అనేకమంది గాయపడడం ఎంతో బాధగా ఉంది.
–కిముడు సత్తిబాబు, బస్సు డ్రైవర్‌

ఆ చిన్నారి మృత్యుంజయురాలు..
పాడేరు ఘాట్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో నెలల వయసున్న ఓ శిశువు సురక్షితంగా బయటపడింది. డుంబ్రిగుడ మండలం తూటంగి గ్రామానికి చెందిన తాంగుల జ్యోతి, సత్యనారాయణ దంపతులకు నాలుగు నెలల క్రితం శిశువు జన్మించింది. ప్రస్తుతం వీరు విశాఖలో ఉంటున్నారు. పాడేరు మండలం పి.గొందూరులో తమ బంధువుల ఇంటికి వచ్చేందుకు విశాఖలో బస్సెక్కారు. ప్రమాదంలో తల్లి జ్యోతి తన బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకుంది. ఆమె తలకు మాత్రం తీవ్ర గాయమైంది. 

క్షతగాత్రులలో కొందరి వివరాలు.. 
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కోటగున్నలకు చెందిన పాంగి సింహాద్రి, హుకుంపేట మండలం ఇసుకగరువుకు చెందిన వంతాల కోటిబాబు, అడ్డుమండకు చెందిన వంచంగిబోయిన రవిబాబు, పాడేరు మండలం దిగుమోదాపుట్టుకు చెందిన కిరసాని వెంకటేష్, కించూరు పంచాయతీ దోనెలకు చెందిన కోడా పద్మ, కిండంగి గ్రామానికి చెందిన జంబు మాధవి, డోకులూరు పంచాయతీ మండిపుట్టుకు చెందిన బోయిన నాగేశ్వరరావు, గెడ్డంపుట్టుకు చెందిన చల్లా పెంటమ్మ, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీకి చెందిన పి.చిట్టిబాబు, అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం లోవ కృష్ణాపురం గ్రామానికి చెందిన కిముడు సత్తిబాబు, చింతపల్లి మండలం కోటగున్నల గ్రామానికి చెందిన పాంగి సింహాద్రి, గెమ్మెలి నగేష్, హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాకకు చెందిన బంటు రఘునాథ్, అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలేనికి చెందిన నరవ ఈశ్వరరావు, నాతవరం మండలం యర్రవరంలోని ఒకే కుటుంబానికి చెందిన బొట్టా చిన్నమ్మలు, బొట్టా నర్శింహమూర్తి, బొట్టా దుర్గాభవాని, బొట్టా రమణ, ముంచంగిపుట్టు మండలం సొనియాపుట్టుకు చెందిన కిల్లో బొదినేష్, హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గంగరాజుపుట్టు గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు చెందిన సమల లక్ష్మీకాంత్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement