
హుజూర్‌నగర్: తనను ప్రేమించడం లేదని యువతితో గొడవపడి ఆమెపై పెట్రోల్ చల్లిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హుజూర్‌నగర్ పట్టణంలో జరిగింది. మంగళవారం ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన యువతి మూడు నెలల నుంచి హుజూర్‌నగర్ పట్టణంలోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటోంది.
స్థానికంగా కోదాడ రోడ్డులో గల ప్రైవేట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తోంది. సదరు యువతికి మోటమర్రి గ్రామానికే చెందిన సుందర్ ప్రమోద్‌కుమార్‌తో పరిచయం ఉంది. సోమవారం ప్రమోద్‌కుమార్ యువతికి ఫోన్ చేసి మాట్లాడాలి బటయకు రమ్మని కోరగా.. ఆమె బయటకు వచ్చింది.
ఈ క్రమంలో తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో యువకుడు గొడవపడ్డాడు. తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను యువతిపై చల్లాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.