
హెపటైటిస్ హడల్..!
● తల్లడిల్లుతున్న పల్లం గ్రామం
● చురుకుగా వైద్య పరీక్షలు
● అంతకంతకూ పెరుగుతున్న కేసులు
● ఆందోళనలో మత్స్యకారులు
సాక్షి, అమలాపురం/కాట్రేనికోన: రోజుల తరబడి సాగుతున్న రక్త పరీక్షలు.. పరీక్షలు జరుగుతున్న కొద్దీ బయటపడుతున్న కామెర్ల సంబంధిత వ్యాధులతో మత్స్యకార గ్రామం పల్లం తల్లడిల్లుతోంది. కాట్రేనికోన మండలం శివారు గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ గ్రామంలో హెపటైటిస్ వ్యాధి ప్రబలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామెర్ల సంబంధిత వ్యాధులు గ్రామంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గ్రామంలో తొలుత నలుగురు గర్భిణుల్లో కాలేయానికి సంబంధించి వాపు లక్షణాలను గుర్తించారు. వీరు కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలకు వెళ్లిన సమయంలో ఇది బయట పడింది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో ఇక్కడ కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా మరిన్ని కేసులు వెలుగు చూశాయి. దీంతో గ్రామంలో ఉన్న అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 12 వేల వరకు జనాభా ఉండగా, వీరిలో 7,800 మంది వరకూ నివసిస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో వేటకు, ఉద్యోగ, ఉపాధికి వెళ్లారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్ల వయస్సు దాటిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకార ఇప్పటి వరకూ 2,281 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో హెపటైటిస్–బి సర్ఫేస్ యాంటిజెన్ (హెచ్‌బీఎస్‌ఏజీ) 12 మందికి నిర్ధారణ అయ్యింది. హెపటైటిస్–సి వైరస్ (హెచ్‌సీవీ) తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో హైపటైటిస్– ఎ, బి, సి కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 118 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలి దశలో చేపట్టిన ర్యాపిడ్ టెస్టులో ఇంతకు రెండు మూడు రెట్లు పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖతో సంబంధం లేకుండా స్థానికంగా వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు చేసేవారు ఒకే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం, గ్రామంలో మత్స్యకారుల సామూహిక జీవన విధానం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు అప్రమత్తమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తోంది భావిస్తున్నారు. మరిన్ని పరీక్షలు జరిగితే మరికొంత మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. అలాగే, వ్యాధి లక్షణాలున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తున్నారు. వారం పది రోజులుగా ఇక్కడ కామెర్లు ప్రబలుతూండగా జిల్లా యంత్రాంగం కేవలం పరీక్షలతో సరిపెడుతోందని, వ్యాధికి సంబంధించిన మందులు వ్యాధిగ్రస్తులకు ఇంకా అందలేదని స్థానికులు చెబుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో పరీక్షలు ముమ్మరం
నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా పల్లం గ్రామంలో కొంత మందికి కాలేయ సంబంధ వ్యాధులైన హెపటైటిస్ బి, సి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత నెల 20న ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు కలెక్టరు ఇంటింటా రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ కిట్లతో కాలేయ పరీక్షలు చేయాలని ఆదేశించారు. గత నెల 24న రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు చేసేందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను పల్లం హెల్త్ సెంటర్‌కు పంపించారు. గత నెల 25 నుంచి వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఆరు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ వరకు రక్త నమూనాలు సేకరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన మొత్తం 5,436 మందికి రక్త నమూనాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 2,318 మంది రక్త నమూనాలు సేకరించి ర్యాపిడ్ టెస్ట్‌లు చేయగా హెపటైటిస్–బి 223, హెపటైటిస్–సి 80 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాట్రేనికోన వైద్యాధికారి లిఖిత మాట్లాడుతూ, పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను అదనపు పరీక్షల కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. మరిన్ని పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ కేసులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యాంటీ వైరల్ మాత్రలు అందచేస్తామన్నారు.
వారం రోజుల్లో పరీక్షలు పూర్తి
గ్రామంలో హైపటైటిస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రకాల వైద్య సేవలూ అందిస్తున్నాం. వారం రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తాం.
– దుర్గారావుదొర,
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
వైద్యులకు పూర్తి సహకారం
కామెర్ల సంబంధిత వ్యాధులు ప్రబలుతూండటంతో గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టాం. తాగునీటి నాణ్యతపై మరింతగా దృష్టి సారించాం. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు వైద్యులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం.
– మల్లిడి వీరబాబ్జీ, సర్పంచ్, పల్లం, కాట్రేనికోన మండలం

హెపటైటిస్ హడల్..!

హెపటైటిస్ హడల్..!

హెపటైటిస్ హడల్..!

హెపటైటిస్ హడల్..!