తడిసి ముద్దైపోయేలా చెమటలు పడుతున్నాయా..? | Excessive Sweating Symptoms Causes And Treatment | Sakshi
Sakshi News home page

తడిసి ముద్దైపోయేలా చెమటలు పడుతున్నాయా..? ఇలా ఎందుకంటే..

Published Sun, Apr 13 2025 11:38 AM | Last Updated on Sun, Apr 13 2025 11:54 AM

Excessive Sweating Symptoms Causes And Treatment

Photo Courtesy : The health website

చెమట పట్టడం అందరిలో కనిపించే ఓ జీవక్రియ. వాతావరణంలో వేడిమి పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా దేహ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని క్రమబద్ధీకరించేందుకు చెమటలు పట్టి... అవి దేహంలోని ఉష్ణోగ్రతను గ్రహించి ఆవిరి కావడంతో దేహం చల్లబడుతుంది. ఇదే పని వ్యక్తులు శారీరక శ్రమ చేసినప్పుడూ,  బాగా ఆటలాడినప్పుడూ జరుగుతుంది. అంతేకాదు... బాగా ఆందోళనకు గురైనప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది మానవ మనుగడకు ప్రకృతి చేసిన ఏర్పాటు. కొందరిలో అతిగా చెమటలు పడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో, ఇలాంటివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు తెలిపే కథనమిది.  

మనుషుల్లో ఎక్రైన్‌ అలాగే అపోక్రైన్‌ గ్లాండ్స్‌ అనే రెండు రకాల గ్రంథులుంటాయి. వీటిల్లో ఎక్రైన్‌ గ్లాండ్స్‌ అనే చెమట గ్రంథులు పుట్టినప్పటి నుంచీ ఒంటి నిండా వ్యాపించి ఉంటాయి. అయితే అపోక్రైన్‌ గ్రంథులనేవి బాహుమూలల్లోనూ, ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర ఉండి, కొంతకాలం తర్వాత (అంటే ముఖ్యంగా యుక్తవయసుకు వచ్చాక) అవి క్రియాశీలమవుతాయి. అందుకే చిన్నప్పుడు కాకుండా యుక్తవయసుకు వచ్చాకే బాహుమూలాల్లోనూ, ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర చెమట పట్టడం మొదలవుతుంది.  

చెమటలు పట్టడం కొందరిలో మరీ ఎక్కువ...
కొందరిలో చెమట పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. చెమటలు ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలూ ఎదురవుతాయి. కొందరిలో అరికాళ్లు తేమగా అవుతుంటాయి. మరికొందరిలో అరచేతుల్లో చెమటలు ఎక్కువగా పట్టడంతో ఏది పట్టుకున్నా తడిసిపోవడం, జారిపోవడం కూడా జరుగుతుంటుంది. ‘హైపర్‌ హిడరోసిస్‌’లో మళ్లీ రెండు రకాలు. అవి... 

  • జనరలైజ్‌డ్‌ హైపర్‌ హిడరోసిస్‌ (దేహమంతటా విపరీతంగా చెమటలు పట్టడం) 

  • లోకలైజ్‌డ్‌ హిడరోసిస్‌ (దేహంలోని కొన్ని చోట్లలోనే చెమటలు ఎక్కువగా పట్టడం). 

జనరలైజ్‌డ్‌ హైపర్‌ హిడరోసిస్‌కి కారణాలు... 

  • చలికాలంలో వాతావరణం చల్లగా ఉన్నందున చెమటలు పట్టడం పెద్దగా జరగదు. కానీ వేసవిలో... అందునా మార్చినుంచి వాతావరణంలో వేడిమి పెరగడంతో విపరీతంగా చెమటలు పడుతుంటాయి.  

చెమటలకు మరికొన్ని కారణాలు... 

  • విపరీతమైన దేహశ్రమ లేదా వ్యాయామం తర్వాత 

  • వైరల్‌ ఫీవర్స్, మలేరియా, క్షయ వంటి జబ్బులతో జ్వరం వచ్చి తగ్గాక 

  • గుండెకు సంబంధించిన వ్యాధుల్లో అంటే షాక్, హార్ట్‌ ఫెయిల్యూర్స్‌లో 

  • ఎండోక్రైన్‌ లేదా హార్మోనల్‌ డిజార్డర్స్‌లో (అంటే హైపర్‌ పిట్యుటరీజమ్, హైపర్‌థైరాయిడిజమ్, ఇన్‌కసులినోమా, డయాబెటిస్‌ వంటి సమస్యల్లో) 

  • లింఫోమా, కార్సినాయిడ్‌ సిండ్రోమ్‌ వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో 

  • గర్భిణుల్లో అలాగే మెనోపాజ్‌కు దగ్గరవుతున్నప్పుడు 

  • స్థూకాలయం ఉన్నవారిలో 

  • మద్యం తాగాక 

  • ఫ్లూయాక్సిటిన్‌ వంటి మందులు వాడుతున్నప్పుడు పార్కిన్‌సన్స్‌ జబ్బులున్నవారిలో, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్‌ సమస్యలున్నవారిలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.

లోకలైజ్‌డ్‌ హైపర్‌ హిడరోసిస్‌ రకాలు... 
ఎమోషనల్‌ ఆర్‌ ఎసెన్షియల్‌ హైపర్‌ హిడరోసిస్‌ : తీవ్రమైన ఉద్విగ్నత ఉన్నప్పుడు లేదా ఉద్వేగాలు లేదా భయాలకు లోనైనవారిలో అరచేతులు, అరికాళ్లలో విపరీతంగా చెమటలు పడుతుండటం చాలామంది అనుభవంలోకి వచ్చే విషయమే 

యాగ్జిలరీ హైపర్‌ హిడరోసిస్‌ : బాహుమూలాల్లో చెమటలు పట్టడం ∙గస్టెటరీ హైపర్‌ హిడరోసిస్‌ : బాగా వేడివీ లేదా బాగా ఘాటైన మసాలాలతో కూడిన ఆహారాలు తీసుకుంటున్నప్పుడు కొందరిలో పెదవుల చుట్టూ లేదా ముక్కు మీద, నుదుటి మీద, తలలో విపరీతంగా చెమటలు పట్టడం పోశ్చరల్‌ లేదా ప్రెజర్‌ హైపర్‌ హిడరోసిస్‌ : కుర్చీల్లో కూర్చున్నప్పడు లేదా సీట్‌కు అనుకుని ఉన్న శరీరభాగమంతా చెమటలు పట్టడం వంటి రకాలు కూడా చూడవచ్చు 

ఎమోషనల్‌ లేదా ఎసెన్షియల్‌ హైపర్‌ హిడరోసిస్‌ : ఉన్నవాళ్లలోనూ కాస్త వైవిధ్యమైన లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు కొందరిలో అరచేతులు, అరికాళ్లలో మాత్రమే చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి లక్షణాలు సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంటాయి 

కొందరిలో వేసవిలో అరచేతుల్లో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంతో చేతుల్లోని  వస్తువులు తడిసిపోవడం, జారిపోవడం జరుగుతుండవచ్చు. అలాగే కాళ్ల నుంచి చెమటలు కారుతున్నప్పుడు వాళ్ల అరికాళ్ల గుర్తులు నేల/గచ్చు మీద కనిపిస్తుంటాయి. కొందరిలో చెప్పులూ జారిపోవచ్చు 

ఇంకొందరిలో పగటిపూట చాలా ఎక్కువగానూ, రాత్రుళ్లు తక్కువగానూ, నిద్రలో పూర్తిగా లేకుండానూ ఉండవచ్చు. లేదా మరికొందరిలో దీనికి పూర్తి భిన్నంగా  ఉండవచ్చు.

ఇలా చెమట పట్టేవారిలోనూ రెండు రకాలుగా చెమటలు పట్టవచ్చు. అవి... 

  • కంటిన్యువస్‌ స్వెటింగ్‌ : చెమటలు నిరంతరమూ ధారాపాతంగా  పడుతుండవచ్చు. వేసవిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ.

  • ఫేజిక్‌ స్వెటింగ్‌ : ఏ చిన్న పనిచేసినా లేదా ఏ చిన్నపాటి ఒత్తిడికి గురైనా అప్పడు మాత్రమే కంటిన్యువస్‌గా చెమటలు పడతాయి.

అరచేతులూ... అరికాళ్లలో చెమటలతో సమస్యలిలా... 
పిల్లల్లో ఇలా చెమట పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమటలు ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగి΄ోయే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇలాంటి పిల్లలు సాధారణంగా చేతికింద రుమాలు పెట్టుకుని రాస్తుంటారు 

టెన్నిస్, క్రికెట్‌ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్‌ లేదా టెన్నిస్‌ రాకెట్‌ జారి΄ోతుంటాయి∙ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం నలుగురు కలిసే సోషల్‌ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం లేదా నిర్భయంగా షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేకపోవడం కొందరిలో నడుస్తుండగానే చెప్పులు / పాదరక్షణలు జారిపోవడం (ఇలాంటివారు షూ వేసుకోవడం వల్ల కొంతవరకు మంచి ప్రయోజనమే ఉంటుంది. 

అయితే విపరీతమైన చెమటల కారణంగా వారి మేజోళ్లు తడిసి΄ోతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన పొడి మేజోళ్లు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటలు, మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి.. 

కాంటాక్ట్‌ డర్మటైటిస్‌: చర్మానికి సంబంధించిన అలర్జీలు రావడం ∙పామ్‌ఫోలిక్స్‌ : చర్మంపై చిన్న చిన్న నీటి బుడగలు వచ్చి దురదగా ఉండటం 

పిట్టెడ్‌ కెరటోలైసిస్‌ : చర్మానికి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావడం 

డర్మటోఫైటోసిస్‌: చర్మంపై ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావడం.

చికిత్సలు...  
చెమట పట్టే సమస్య కొందరిలో దానంతట అదే తగ్గి΄ోతుంది. తగ్గకపోతే ఈ కింది సూచనలు/చికిత్సలు అవసరమవుతాయి. 

యాంటీ పెర్‌స్పెరెంట్లు : ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఫార్మాల్‌డిహైడ్, గ్లూటరాల్‌ డిహైడ్, 20% అల్యూమినియం క్లోరైడ్‌ హెగ్జాహైడ్రేట్‌... వీటిని డాక్టర్ల సలహా మేరకే వాడాలి. యాంటీ పెర్‌స్పిరెటంట్లు ఎక్కువగా లేదా డాక్టర్‌ సలహా లేకుండా వాడటం వల్ల కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ అనే అలర్జీలు వచ్చే అవకాశాలెక్కువ 

డియోడరెంట్లు : ఇవి చెమటను తగ్గించవు, నిరోధించవు. కానీ చెమట వల్ల దుర్వాసనను కొంత తగ్గిస్తాయి.  

అయాన్‌ ఫోరోసిస్‌ : ఇదికరెంట్‌ ద్వారా చేసే చికిత్స 

బొట్యులినమ్‌ టాక్సిన్‌ : ఇదో రకం విషం. ఇంజెక్షన్‌ సహాయంతో చేసే చికిత్స ఇది 

శస్త్రచికిత్స : సింపాథెక్టమీ అనే సర్జరీ. (ఇటీవల దీన్ని ఎక్కువగా సిఫార్సు చేయడం లేదు. దీంతో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నందున అంతగా ప్రోత్సహించడం లేదు).

జాగ్రత్తలు... 

  • రోజూ స్నానం చేయాలి. వీలైతే రోజుకు రెండుసార్లు చేస్తే ఇంకా మంచిది ∙

  • మాయిష్చరైజర్‌ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్‌ సబ్బులు వాడటం మంచిది 

  • చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్‌ / నూలు దుస్తులు ధరించడం మేలు 

  • ఎప్పటికప్పుడు బాగా ఉతికిన, శుభ్రమైన బట్టలనే ధరిస్తుండాలి. 

(చదవండి: ముప్పై ఐదు ఏళ్లు, ఐదేళ్ల కూతురు కూడా ఉంది మరో బేబీ కోసం ప్లాన్‌ చెయ్యొచ్చా..?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement