
స్మార్ట్‌గా..అందంగా కనిపించడం అనేది మోడళ్లు, సినీతారలు ప్రముఖులకే పరిమితం కాలేదు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్‌నైట్ స్టార్‌లుగా మారుతున్న వాళ్లు సైతం అదే బాటపడుతున్నారు. ఇది ఆరోగ్యకరంగా ఉంటే ఏం సమస్య లేదు. తక్కువ సమయంలో సన్నగా మారిపోవాలనుకుంటేనే.. ఆరోగ్యమే చిక్కుల్లో పడుతుంది. చాలామంది ఏదీఏమైనా పర్లేదు అంటూ రిస్క్ చేసి మరీ తప్పుడు డైటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకోసం శరీరాన్ని ఎంతలా కష్టపెడుతున్నారంటే..కేవలం వర్కౌట్‌లు కాదు, ఆహారం పరంగా శరీరం శుష్కించిపోయేలా చేస్తున్నారు. అవి వింటే.. బరువు తగ్గడం కోసం ఇన్ని పాట్లు పడుతున్నారా అని ఆశ్చర్యమేస్తుంది. ఆకృతికి ఇంత ప్రాముఖ్యత..? అనిపిస్తుంది కూడా. ఒర్రిగా ప్రసిద్ధిచెందిన కంటెంట్ క్రియేటర్ సైతం ఇలాంటి పనులే చేసి బరువు తగ్గాడట. అతడు బరువు తగ్గే క్రమంలో అనుసరించిన విధానాలు తెలిస్తే..నిజంగానే వాంతి చేసుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందులో నో డౌట్.
ఒర్రీగా ప్రసిద్ధి చెందిన ఓర్హాన్ అవత్రమణి అనే కంటెంట్ క్రియేటర్ 2023 ప్రారంభం వరకు 70 కిలోల బరువుతో ఉండేవాడు. చూడటానికి కొద్దిగా లావుగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త ఫేమస్ కావడంతో టీవీ షోల్లో కనిపించేందుకు స్మార్ట్‌గా ఉండక తప్పదు. అందుకోసం అతను తిన్న ఆహారాన్ని వాంతి చేసుకునేవాడట.
అలా చేసుకుంటే కాసేపటి వరకు వాంతి వస్తున్న ఫీలింగే ఉండి.. తిన్న ఆహారం అంతా బయటకొచ్చేస్తుంది. తద్వారా నీరసించి బరవు తగ్గేవాడట. అలా వాంతులు చేసుకుని చివరకు టాయిలెట్‌లో నిద్రపోయేవాడట. దాంతో మెడనొప్పితో ఇబ్బందిపడేవాడినంటూ తన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎలా మొదలయ్యాయో వివరించాడు ఓ ఇంటర్వ్యూలో.
బరువు తగ్గడం కోసం ఓజెంపిక్ లాంటి మందులు వాడొచ్చు. అయితే అది ఛీటింగ్ అవుతుందే తప్ప బరవుతగ్గడం కాదనే నమ్ముతా అంటున్నాడు ఒర్రీ. అయితే తన దృష్టిలో బరువు తగ్గడానికి అదే బెస్ట్ అని కితాబిస్తున్నాడు. కాగా, ఒర్రీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేయడమే గాక . ఓ సామాజిక కార్యకర్త కూడా. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా సెలబ్రిటీల పార్టీల్లో మెరుస్తుంటాడు. అలాగే బాలీవుడ్ టీవీ షోల్లో తళ్లుకుమంటుంటాడు.
ఎంత ప్రమాకరమైనదంటే..
తనను తాను ఆకలితో అలమటింపచేసుకునేలా పదేపదే వాంతులు చేసుకోవడం అనే ప్రక్రియ అత్యంత హానికరమైనదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శారీరకంగా మానసికంగా అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీర్ణశయాంతర సమస్యలు, గుండెకు సంబంధించిన రుగ్మతల బారినపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు.
అంతేగాదు ఆకలి శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలను బలహీనపరిచి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని అన్నారు. కెరీర్‌లో విజయం సాధించడానికి ఎలా షార్ట్‌కట్‌లు ఉండవో అలాగే బరువు తగ్గడంలో కూడా ఉండవని తేల్చి చెబుతున్నారు.
ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు సన్నగా మార్చినప్పటికీ..రాను రాను చిరాకు, ఒత్తిడి, వంటి వాటికిలోనై మొత్తం శరీరం పనితీరుపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అందువల్ల ఇలాంటి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మసౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తూ..ఆరోగ్యప్రదంగా బరువు తగ్గే వాటిని అనుసరిస్తే అన్ని విధాల మేలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
(చదవండి: ఇదేం ఫిట్‌నెస్ స్టంట్..? తిట్టిపోస్తున్న నెటిజన్లు)