
ఉద్యాన పంటలతో సిరులు
ఆసక్తి చూపుతున్న రైతులు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని వరి సాగు చేస్తే సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధర అందడం లేదని ఆందోళన చెందుతున్న రైతులు తమ ఆలోచను మార్చుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు బదులుగా ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తమకున్న కొద్దిపాటి సాగు భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే సాగును లాభాల బాటలో నడిపించొచ్చని నిరూపిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 90 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
పందిరి సాగుతో మేలు
రైతులు వారి భూముల్లో పందిరి వేసి, ఉద్యాన పంటను సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఎకరా భూమిలో పందిరి సాగు అమలు చేసే రైతులు ఉద్యానశాఖ ద్వారా రూ. లక్ష సాయం అందిస్తుండగా, ఇందులో రూ. 50 వేలు సబ్సిడీ వస్తుంది. మిగితా సగాన్ని రైతులు భరించాల్సి వస్తుంది. అధికారులే పందిరి సిద్ధం చేసి ఇస్తారు. సుమారు నాలుగేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీగజాతి కూరగాయలు పండించుకోవచ్చు. కాకర, బీర, దొండ, సోరకాయ పండిస్తూ ఆదాయం పొందవచ్చు. పందిరి కింది బాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో టమాట, వంకాయ, బెండ వంటి అంతర పంటలు సాగు చేయవచ్చు.
దిగుబడి బాగుంది
పందిరి సాగు విధానంతో దిగుబడులు బాగున్నాయి. ఈ విధానం ద్వారా కలుపు తక్కువగా ఉండి కూలీల అవసరం ఉండదు. కూరగాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. చీడ పీడలు ఎక్కువగా ఆశించవు. పంటలు సాఫీగా వస్తాయి. మార్కెట్‌ల మంచి ధర పలుకుతుంది. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)
–నాగర్తి తిరుపతిరెడ్డి, రైతు మాచాపూర్
ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం