
సరిగ్గా యుద్ధం ఆరంభం కాబోతుండగా, అర్జునుడు అకస్మాత్తుగా అశ్రునయనాలతో ‘నేను ఈ యుద్ధం చేయ లేను!’ అనేశాడు. ఆ మాటకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ‘తం ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ.’ సమాధానం విషయం తరవాత. తనకు అత్యంత ఆప్తుడూ, మహావీరుడూ అంతటి విషాదగ్రస్థుడై ఉంటే, అచ్యుతుడికి చిరునవ్వు ఎందుకు వచ్చినట్టు అంటే చాలా కారణాలు కనిపిస్తాయి. సమ్మోహనకరమైన చిరునవ్వు శ్రీకృష్ణుడి సహజ లక్షణం. ఆయన నల్లనివాడూ, నవ్వు రాజిల్లెడి మోమువాడూ కదా! అదొక కారణం.
ఎన్నో ఆశలు తన మీద పెట్టుకొని, ఇంత సేన యుద్ధంలోకి దిగ గానే, తమ పక్షంలో అందరికంటె గొప్పవీరుడు ‘నేను యుద్ధం చేయను, పొ’మ్మంటే, సామాన్యుడయితే కోపావేశంలో మునిగి పోయేవాడు. కానీ, విషమ సమయంలో ప్రశాంతతను కోల్పోతే, తల పెట్టిన కార్యం తలకిందులవుతుందని ఆ ఘటనాఘటన సమర్థుడికి బాగా తెలుసు. కనక ఆయన చిరునవ్వు చెదరలేదు.
శ్రీకృష్ణుడి చిరునవ్వుకు ముఖ్య కారణం అర్జునుడి ఆవేదన వెనక ఉన్న అజ్ఞానమూ, అమాయకత్వమూ! ‘నేను స్వజనాన్ని చంపితే పాపాన్ని పొందుతాను!’ అన్న అభ్యంతరం ఆధ్యాత్మిక దృష్ట్యా అన్నివిధాలా అవక తవకగా ఉంది. ఆయన ‘నేను, నేను’ అని అహంకరిస్తు న్నాడు, ‘నేను’ అంటే ఎవరో గ్రహించకుండా. ‘స్వజనం, బంధుమిత్రులూ’ అంటూ ‘మమ’కారం చూపుతున్నాడు, ఆత్మస్వరూపుడైన తనకు స్వజనం–పరజనం అన్న పరి మితులు లేవని విస్మరించి! ‘చంపటం’ గురించి వాపోతు న్నాడు, చావు గురించిగానీ, చంపేదెవరూ, సమసేదెవరూ అని గానీ సరైన ఎరుక లేకుండా! ‘పాపం తగులుతుంద’ని బాధపడుతున్నాడు, ఎటువంటి కర్మల వల్ల పాప పుణ్యాలు చుట్టుకొంటాయో, ఎలాంటి కర్మలవల్ల పాప పుణ్యాల బంధనాలను తప్పించుకోవచ్చో మరచిపోయి! మహామహా వీరులు కూడా జగన్మాయకు అతీతులు కాలేరు గదా అన్న స్ఫురణ కలిగి, మాధవుడి ముఖాన ముందొక మందహాసం వెలిగింది. ఆ తరవాత వివరంగా గీతాబోధ చేశాడు.
– ఎం. మారుతి శాస్త్రి