
ఇన్నోవేషన్
నన్ను దోసెకుందువటే!
‘దోసెలందు డెస్క్‌టాప్ దోసెలు వేరయా’ అని ఎవరూ అనలేదు కానీ ఈ మనసు దోచే దోసెను చూస్తే మాత్రం అనక తప్పదు. పట్నాలోని పూల్‌బాగ్ పట్న కాలేజి’కి ముందు ఉన్న చిన్న హోటల్ యజమాని తయారుచేసే ‘దోశ’‘హార్ట్’ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ దోసెను ప్రింటింగ్ మెషీన్‌తో తయారు చేయడం! ఈ ‘యంత్ర దోశ’ను చూసి ఆశ్చర్యపడి, అబ్బురపడి‘ఎక్స్’లో ‘22వ శతాబ్దం ఆవిష్కరణ’ కాప్షన్‌తో మోహిని అనే యూజర్ పోస్ట్ చేశారు. ఇది చూసి ముగ్ధుడై ముచ్చటపడిన పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ‘ది డెస్క్ టాప్ దోశ’ అనే కాప్షన్స్‌తో ఈ వీడియోను రీపోస్ట్ చేశారు.
ఇంతకూ ఆ వీడియోలో ఏముంది?’ అనే విషయానికి వస్తే... సదరు హోటల్ యజమాని మెషిన్‌లోని ఐరన్ ప్లేట్‌పై రుబ్బిన పిండి పోసిన వెంటనే ఇటు నుంచి ఒక రోలర్ వచ్చి ‘దోశ’ ఆకారాన్ని సెట్ చేస్తుంది. దీనిపై తగిన దినుసులు వేయగానే అటు నుంచి రోలర్ వచ్చి రోల్ చేస్తుంది. నిమిషాల వ్యవధిలో ‘ఆహా’ అనిపించేలా దోశను అందిస్తుంది.
The Desktop Dosa… https://t.co/gw6EHw3QZ7
— anand mahindra (@anandmahindra) November 14, 2024
ఇక సోషల్ మీడియావాసుల రెస్పాన్స్ చూస్తే.... ‘భవిష్యత్తులో ఈ దోసె మెషిన్ ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు’ అన్నారు చాలామంది.
కొద్దిమంది మాత్రం... ‘చాల్లేండి సంబడం. ఎంతైనా దోసెకు మనిషి స్పర్శ ఉండాల్సిందే. మనిషి చేసిన దానితో ఇలాంటి యంత్ర దోసెలు సరితూగవు’ అని తూలనాడారు. లోకో భిన్న‘రుచిః’!
‘ఇంతకీ ఈ మెషిన్ ఎలా పనిచేస్తుంది..’ అనేది చాలామందికి ఆసక్తి కలిగించే విషయం. ఆ రహçస్యం గురించి అడిగితే... ‘అమ్మా.... ఆశ దోశ అప్పడం వడ... నేను చెప్పనుగాక చెప్పను’ అంటాడో లేక ‘ఇది నా ట్రేడ్ సీక్రెట్టేమీ కాదు. అందరూ బేషుగ్గా చేసుకోవచ్చు’ అని చెబుతాడో... వేచి చూడాల్సిందే.