
కౌరవులతో జరిగిన మాయద్యూతంలో ఓడిపోయి పాండవులు అడవుల పాలయ్యారు. ద్రౌపదీ సమేతంగా పాండు నందనులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అడవులలో సంచరిస్తూ నానా ఇక్కట్లు పడసాగారు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు శిష్యసమేతంగా పాండవులనే అనుసరిస్తూ అరణ్యమార్గం పట్టాడు. అరణ్యవాస కాలంలో ధౌమ్యుడు పాండునందనులకు అనేక ధర్మశాస్త్రములు, పురాణాలను చెబుతూ ఉండేవాడు. వారి చేత సమయానుకూలంగా పూజ పురస్కారాదులు చేయిస్తూ ఉండేవాడు.
కొన్నాళ్లకు పాండవులు ద్వైతవనానికి చేరుకుని, అక్కడ మకాం వేశారు. పాండవులను చూడటానికి ఒకనాడు వ్యాస మహర్షి ద్వైత వనానికి చేరుకున్నాడు. ధర్మరాజు, ఆయన నలుగురు సోదరులు, ధౌమ్యుడు, ఆయన శిష్యులు ఎదురేగి వ్యాస మహర్షిని సగౌరవంగా స్వాగతించారు. ధర్మరాజు ఆయనకు అర్ఘ్య పాద్యాలను సమర్పించి, అతిథి సత్కారాలు చేశాడు. పాండవుల యోగక్షేమాలను వ్యాసుడు పేరు పేరునా అడిగి తెలుసుకున్నాడు. ద్రౌపది పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు.‘మహర్షీ! ఎన్నడూ ధర్మం తప్పని మాకు ఈ అరణ్యవాస క్లేశమెందుకు సంభవించింది? తెలిసి గాని, తెలియక గాని మా వల్ల జరిగిన అపరాధం ఏదైనా ఉందా? తెలిసీ తెలియక అపరాధం చేసిన ఫలితంగానే ఈ ఇడుములు సంభవించినట్లయితే, దానికి పరిహారమేదైనా ఉందా?’ అని ధర్మరాజు సవినయంగా వ్యాసుడిని అడిగాడు.
‘నాయనా, యుధిష్ఠిరా! నీ సోదరుడు అర్జునుడు తెలిసీ తెలియనితనంతో ఒకసారి హనుమంతుడి పట్ల అపచారం చేశాడు. దాని ఫలితంగానే మీకు ఈ ఇక్కట్లన్నీ వచ్చి పడ్డాయి. రాజసూయం విజయవంతంగా చేసిన ఆనందంలో మీరంతా ఇంద్రప్రస్థంలో తులతూగుతూ ఉన్న కాలంలో ద్రౌపది హనుమద్వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది. సంకల్పానికి చిహ్నంగా పవిత్ర తోరాన్ని ధరించింది. అర్జునుడు ఆమె చేతికి ఉన్న తోరాన్ని గమనించాడు. అదేమిటని అడిగాడు. హనుమద్వ్రతం చేసే సంకల్పంతో కట్టుకున్న పవిత్ర తోరమని ద్రౌపది చెప్పింది. ఈ వ్రతం చేయమని తనకు శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పింది. తన రథం మీదనున్న జెండాపై ఉండేవాడు ఒకరు, తన రథాన్ని తోలేవాడు ఇంకొకరు. వీరిద్దరూ తనకంటే అధికులా అనే అహంకారంతో అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న ఆ తోరాన్ని తీసేయించాడు.
పూజలు వ్రతాలు దేవతలకు చేయాలి గాని, ఒక వానరానికి చేయడమా అని ఈసడించాడు. ద్రౌపది విలపిస్తూ తోరాన్ని తీసేసింది. ఫలితంగా తాను సంకల్పించిన వ్రతాన్ని ఆమె చేయలేకపోయింది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు చేయవలసిన పవిత్ర వ్రతం అది. ద్రౌపదికి వ్రతభంగం జరిగిన కారణంగానే మీకు ఇక్కట్లు మొదలయ్యాయి. పదమూడేళ్లు మీకు ఈ కష్టాలు తప్పవు. ఆ తర్వాతనైనా సకల శుభాలు జరగాలంటే, ఈ వనవాసకాలంలోనే హనుమద్వ్రతం చేయడం మంచిది’ అని చెప్పాడు వ్యాసుడు.అక్కడే ఉన్న ద్రౌపది తనకు వ్రతభంగం కలిగిన మాట నిజమేనని చెప్పింది. అర్జునుడు తానే ఆమె చేతికి ఉన్న తోరాన్ని తీసివేయించానని పశ్చాత్తాపంతో చెప్పాడు.‘సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన వ్రతాన్ని ఇప్పటికైనా ఆచరించడమే మీకు శ్రేయస్కరం’ హితవు చెప్పాడు వ్యాసుడు.
‘వ్రత విధానం ఏమిటో సెలవివ్వండి మహర్షీ!’ అని ప్రార్థించాడు ధర్మరాజు.‘మార్గశిర శుక్ల త్రయోదశి రోజున హనుమంతుడి విగ్రహాన్ని గాని, చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించి పూజించాలి. హనుమంతుడి శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపా కలశంలోకి ఆవాహన చేసి, కలశ స్థాపన చేయాలి. వ్రతానికి ఉపక్రమించే ముందు, వ్రత సంకల్పాన్ని చెప్పుకుని, వ్రతాన్ని ఆచరించేవారు పవిత్ర తోరాన్ని ధరించాలి. పుష్పాక్షతలతో వ్రతపూజ చేయాలి. హనుమంతుడికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. వ్రతపూజ తర్వాత హనుమత్ కథల శ్రవణం చేయాలి.
ఆ తర్వాత హనుమత్ ప్రసాదాన్ని ఆరగించాలి. భక్తిశ్రద్ధలతో ఈ విధంగా పదమూడు సంవత్సరాలు హనుమంతుడిని ఆరాధిస్తే, సంపూర్ణంగా హనుమంతుడి అనుగ్రహం లభించి, ఆపదలు, గ్రహబాధలు, రోగపీడలు, శత్రుబాధలు తొలగుతాయి. సకల సంపదలు, సుఖశాంతులు దక్కుతాయి’ అని వివరించాడు వ్యాసుడు. అంతేకాకుండా, హనుమంతుడి మహిమను తెలిపే కథలను ఆయన పాండవులకు చెప్పాడు. వనవాస కాలంలో సాక్షాత్తూ శ్రీరాముడు సుగ్రీవాదులతో కలసి పంపాతీరాన హనుమత్ వ్రతాన్ని ఆచరించాడని, ఆ తర్వాత లంకపై వానర సేనతో కలసి దండెత్తి, రావణ సంహారం చేయగలిగాడని చెప్పాడు.
ద్వైతవనంలో పాండవులతో కొన్నాళ్లు గడిపి వ్యాసుడు తన దారిన తాను వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు మార్గశిర మాసం వచ్చింది. వ్యాసుడు చెప్పినట్లుగానే ద్రౌపదీ సమేతంగా పాండవులు ధౌమ్యుడి ఆధ్వర్యంలో హనుమత్ వ్రతాన్ని ఆచరించారు. నియమం తప్పకుండా పదమూడేళ్లూ పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సకల శుభాలు కలిగాయి. అర్జునుడి జెండాపై పరివేష్ఠితుడైన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తుదముట్టడంతో పాండవులకు రాజ్యం దక్కింది.
∙సాంఖ్యాయన