
వాషింగ్టన్: ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ రుచి చూడాల్సి వస్తుందన్నారు.
మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్
ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.
2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దు
ట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటు ఇరాన్ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.
ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్‌లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.