
దుబాయ్: అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం నేత ఖొమైనీకి రాసిన లేఖపై ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అలాగే, ట్రంప్ బాంబు దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా మసూద్..‘ఎన్నో వాగ్దానాలను అమెరికా కాలరాసింది. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి’ అని పేర్కొన్నారు. దీనిద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. పెజెష్కియాన్ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.
మరోవైపు.. ఇరాన్‌ను అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో.. ఆ దేశంపై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ స్పష్టం చేశారు.
ఇక, ట్రంప్ మొదటి హయాంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్‌తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం’ అని తెలిపారు.