White House: ముందే లీక్‌.. మరీ ఇంత నిర్లక్ష్యమా? | How White House Officials Accidentally Shared Yemen War Plan With Journalist, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

White House: ముందే లీక్‌.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

Published Tue, Mar 25 2025 8:04 AM | Last Updated on Tue, Mar 25 2025 10:00 AM

How White House Officials Accidentally Shared Yemen War Plan With Journalist

వాషింగ్టన్‌: వైట్‌హౌజ్‌లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  పొరపాటున యెమెన్‌ యుద్ధ ప్రణాళికను ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అదీ.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)  ప్రకటన చేయకమునుపే కావడం ఇక్కడ గమనార్హం. 

అమెరికా రక్షణశాఖమంత్రి పీట్‌ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు ఉన్న గ్రూప్‌లోకి ఓ యూఎస్‌ జర్నలిస్టుకు ప్రవేశం కల్పించారు. ఆ గ్రూప్‌లో అతనున్నాడనే విషయం కూడా హౌతీ రెబల్స్‌పై యుద్ధానికి సమాచారం పోస్ట్‌ చేశారు. ‘ద అట్లాంటిక్‌’ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌  జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ స్వయంగా ఈ విషయం తెలియజేశారు. 

మార్చి 15వ తేదీన యెమెన్‌పై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కానీ, అంతకంటే ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్ ద్వారా తనకు నోటీసు అందిందని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల ముందే ఆయన్ని ఆ గ్రూప్‌లో యాడ్‌ చేశారట!. అయితే అవకాశం ఉన్నా.. ఆయన ఆ సమాచారాన్ని పబ్లిష్‌ చేయలేదు. 

జెఫ్రీ ప్రకటన తర్వాత విషయం ధృవీకరించుకున్న వైట్‌హౌజ్‌ అధికారులు నాలిక కర్చుకున్నారు. ఈ విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం వైట్‌హౌజ్‌ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఎలాంటి దాడులు జరపుతామనే ప్రణాళిక అందులో ప్రస్తావించలేదని పేర్కొన్నాయి.  ఈ వ్యవహారం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

ముమ్మాటికీ ఇది భద్రతా లోపమేనంటున్న డెమోక్రట్లు.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక జాతీయ భద్రతకు సంబంధించిన నిర్లక్ష్యపూరిత వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అమెరికా నౌకలు, విమానాలపై యెమెన్‌ హౌతీలు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. ట్రంప్‌ సర్కారు సైనిక చర్యను మొదలుపెట్టింది. ‘‘హౌతీలు మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ముందుగానే ట్రంప్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో హౌతీలకు మద్ధతుగా ఉన్న ఇరాన్‌ను హెచ్చరించారాయన. 

మార్చి15-16 నుంచి మొదలైన దాడులు.. యెమెన్‌ రాజధాని సనా, సదా, అల్‌ బైదా, రాడాలే లక్ష్యంగా జరుగుతున్నాయి. అయితే.. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్‌ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది. యెమెన్‌ దళాలు ధీటుగానే అమెరికా సైనిక చర్యకు స్పందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement