
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పురుగుల మందు తాగగా, ఒకరు ఉరేసుకున్నారు. మరొకరు భవనంపై నుంచి దూకారు.
యజమాని దూషించాడని పాలేరు..
వేమనపల్లి: మండలంలోని మంగెనపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు నాయిని కన్నయ్య(35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నయ్య గ్రామంలోని రైతు ఎనగంటి చిన్నన్న వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. శుక్రవారం పొలానికి పురుగుల మందు పిచికారీ చేశాడు. స్ప్రేయర్ పంపు చెడిపోయిందని, ఎవరు బాగు చేయిస్తారని చిన్నన్న కన్నయ్యతో గొడవపడ్డాడు. అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెందిన కన్నయ్య అక్కడే పురుగుల మందు తాగాడు. 108 అంబులెన్స్‌లో చెన్నూర్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. యజమాని వేధింపుల వల్లే కన్నయ్య మృతి చెందాడని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం, జిల్లా అధ్యక్షుడు బాగాల రాజన్న, నాయకురాలు మల్లేశ్వరితో మృతుడి కుటుంబ సభ్యులు మంగెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి ధర్నా చేశారు. మృతికి కారణమైన చిన్నన్న, భార్య లక్ష్మీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నీల్వాయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తండ్రి బైక్ ఇవ్వలేదని కొడుకు..
నార్నూర్: తండ్రి బైక్ ఇవ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నాగ్‌నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాదిగూడ మండలం ఖడ్కి కొలాంగూడ గ్రామానికి చెందిన మాడవి భీంరావు(19) శుక్రవారం తన తండ్రి మాధవ్‌రావును బైక్ అడిగాడు. భీంరావు తాగిన మైకంలో ఉండడంతో బైక్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన భీంరావు పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నిమ్స్ ఆసుపత్రిపై నుంచి దూకి వ్యక్తి..
బెల్లంపల్లి: బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీకి చెందిన హన్మాండ్ల నారాయణ(55) శుక్రవారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి పైనుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ తండ్రి పోశం అనారోగ్యంతో బాధ పడుతుండగా చికిత్స చేయించడం కోసం నిమ్స్ ఆసుపత్రికి గత నెల 24న తీసుకెళ్లారు. అటెండర్‌గా వెళ్లిన నారాయణ ఆకస్మికంగా పైఅంతస్తు నుండి కిందికి దూకి మృతిచెందాడు. తాగుడు అలవాటు ఉన్న నారాయణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. మృతుడికి భార్య రేణుక, సోదరులు ఉన్నారు.
మద్యానికి బానిసై యువకుడు..
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భోరజ్ మండలం గూడ గ్రామంలో చోటుచేసుకుంది. జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుమ్మ కార్తిక్ (19) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లి గంగమ్మతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించగా మనస్తాంపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.