
ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రాంత ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐబీ వద్ద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఆదివారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జి+5తో నిర్మిస్తున్నా.. జి+10 కోసం డిజైన్ చేశామన్నారు. రూ.50 కోట్లతో చేపట్టిన పనులు 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నాలుగు నెలల రికార్డుస్థాయిలో 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 650 పడకలతో నిర్మిస్తున్న ఇందులో 225 బెడ్‌లతో మాతా శిశు ఆసుపత్రి, 425 బెడ్‌లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొనసాగిస్తామన్నారు. 2027 జూన్‌లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు. రాజీవ్‌నగర్‌లోని కస్తూరిబా పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థినులు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని చెప్పడంతోనే, మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. దీంతో పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు.
నూతన అంబేడ్కర్ విగ్రహం..
ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని ఐబీ చౌరస్తాలో నూతన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. విగ్రహం చుట్టూ పచ్చదనంతో కూడిన గార్డెన్‌ను ఉంటుందన్నారు. ఈ నెల 14వ తేదీన మహాప్రస్థానంలో అంత్యక్రియలను సైతం ప్రారంభించి, పేదలందరికి ఉచితంగా కర్మకాండలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మంచిర్యాలలో 20 వేల మంది విద్యార్థులు అన్ని సౌకర్యాలతో కూడిన హాస్టల్‌లో ఉంటూ విద్యను అభ్యసించేలా సొంత భవనాలు నిర్మిస్తామని తెలిపారు.