
డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంపు
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో పెంచిన డైట్, కాస్మెటిక్ చార్జీలు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లోనూ అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు పౌష్టికాహారం, కాస్మెటిక్ చార్జీల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదివరకు అన్ని తరగతులకు కలిపి రూ.1,225 చెల్లిస్తుండగా.. ప్రస్తుతం తరగతుల వారీగా మెనూ, కాస్మెటిక్ చార్జీలు పెంచారు. 6, 7వ తరగతులకు రూ.1,330, 8వ, 9వ, 10వ తరగతులకు రూ.1,540, ఇంటర్ బాలికలకు రూ.2,100 డైట్ చార్జీలు ఉన్నాయి. కాస్మెటిక్ చార్జీలు 6నుంచి 8వ తరగతి వరకు రూ.100 నుంచి రూ.175, 8నుంచి 10వ తరగతి ఆపై 11సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ రూ.100 నుంచి రూ.275కు పెరిగాయి. కానీ ఎప్పటి నుంచి అమలు అవుతుందనేది ఉత్తర్వుల్లో స్పష్టత లేకుండా పోయింది. మరో పదిహేను రోజులు గడిస్తే వేసవి సెలవులు రానున్నాయి. వచ్చే 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇటీవల సంక్షేమ వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచినా కేజీబీవీల్లో పాత చార్జీలే అమలవుతున్నాయి. ప్రభుత్వం చెల్లించే డైట్ చార్జీలకు నిత్యం సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌కు చెల్లించే ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేజీబీవీల్లో విద్యార్థినులకు ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంపుపై హర్షం వ్యక్తమవుతోంది.
మోనూ అమలు ఇలా..
జిల్లాలో 18 కేజీబీవీలు ఉండగా.. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4,587 మంది బాలికలు చదువుతున్నారు. బాలికలకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మాంసాహారం, పౌష్టికాహారానికి శ్రీకారం చుట్టింది. వారంలో ఆరు రోజులు బుధవారం మినహా అ రటిపండు, లేదా సీజనల్ పండ్లు, సేమియా, గులా బ్‌జామ్, అటుకులు మిక్చర్, పల్లిపట్టి, స్నాక్స్, టీ అందించాల్సి ఉంది. ధరల్లో వ్యత్యాసాల వల్ల అరకొర మోనూ అమలు చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యేవి. కొన్ని చోట్ల మటన్ పెట్టిన సందర్భాలు తక్కువే. చికెన్ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు డైట్ చార్జీలు ఇచ్చేది తక్కువ.. పక్కాగా మో నూ అమలు చేయాలనడంతో తల పట్టుకున్నారు. ప్రభుత్వం చార్జీలు పెంచడం ఉపశమనం కలిగిస్తుంది. చార్జీల పెంపు వల్ల బాలికలకు ప్రయోజనం చేకూరనుందని డీఈవో యాదయ్య తెలిపారు.
కేజీబీవీల్లో బాలికలకు ప్రయోజనం
భోజన నిర్వహణకు తొలగిన అడ్డంకులు