
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం సేకరణకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి ధాన్యం సేకరణ ఏజెన్సీలు, అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 104 దొడ్డురకం, 90 సన్నరకం కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 80 దొడ్డురకం, 39 సన్నరకం, మెప్మా ఆధ్వర్యంలో 4 దొడ్డురకం, 2 సన్నరకం కొనుగోలు కేంద్రాలు మొత్తం 319 ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన, సీఎంఆర్ డెలివరీ సకాలంలో చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయిస్తామని అన్నారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు, సీసీలు, పీఏసీఎస్ కార్యదర్శులు, రైస్‌మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను జిల్లా అదనపు కల్టెర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హరీష్‌రాజ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఆవిష్కరించారు. ప్రోగ్రాం అధికారులు అనిత, ప్రసాద్, కృపాబాయి పాల్గొన్నారు.