
ఎమ్మెల్యేలకు అభివృద్ధిపై ధ్యాస లేదు
● కార్యకర్తలపై అక్రమ కేసులు సహించబోం ● బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
బెల్లంపల్లి: బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఉన్న ధ్యాస అభివృద్ధిపై లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. సోమవారం బెల్లంపల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్, బీజేపీ తీరని అన్యాయం చేస్తున్నాయని, రాష్ట్రానికి ప్రథమ శత్రువులని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెడితే ఊరుకోబోమని, ప్రతీ కార్యకర్తకు అండగా ఉండి జిల్లాలో గులాబీ సైనికులుగా తయారు చేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమ కేసులపై రామగుండం కమిషనరేట్ ముట్టడిస్తామని అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నాయకులు టి.సత్యనారాయణ, కోళి వేణుమాధవ్, బత్తుల సుదర్శన్, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. సోమవారం క్యాతన్‌పల్లిలోని తన నివాసంలో పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూర్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన నిరుద్యోగ యువతకు 45 వేల ఉద్యాగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.