‘కవ్వాల్’లోనూ ముప్పులో పెద్దపులులు
రక్షక దళం ఏర్పాటైతే వేట తగ్గే అవకాశం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పులుల సంరక్షణకు రాష్ట్ర అటవీ శాఖ టైగర్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో ‘కవ్వాల్’ టైగర్ రిజర్వు మరింత పటిష్టం కాబోతోంది. ఏటా ఉమ్మడి జిల్లా పరిధిలోకి అనేక పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిది పులుల వరకు సంచరిస్తున్నాయి. ప్రసిద్ధ బెంగాల్ టైగర్లూ ఇక్కడ సంచరించాయి. కోర్ ఏరియా వరకు వెళ్లకుండా కారిడార్ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా అంధేరి, తిప్పేశ్వర్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యం నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. పెన్‌గంగా, ప్రాణహిత నదులు దాటి ఉమ్మడి జిల్లాకు అడుగుపెడుతున్నాయి.
ఈ పులులకు వేట ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ పులులను కాపాడుకోవాలంటే మరింత నిఘా అవసరం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ 41.09శాతం విస్తరించి ఉండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 40.24, ఆదిలాబాద్‌లో 29.51, నిర్మల్‌లో 29.83శాతాల్లో విస్తరించి ఉంది. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు’ 2022 రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 115.50, నిర్మల్‌లో 45.34చ.కి.మీ.చొప్పున అటవీ విస్తీర్ణం తగ్గినట్లు తేలింది. ఈ క్రమంలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు టైగర్‌ఫోర్స్ ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా అడవుల రక్షణకు దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నో ఏళ్లుగా డిమాండ్లు
టైగర్ రిజర్వులు ఉన్న రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కవ్వాల్ పరిధిలో పులులు ఇతర వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇప్పుడున్న సిబ్బంది, అధికారులకు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సరిపడా సిబ్బంది లేమితోపాటు పని ఒత్తిడితో ఉన్నారు. చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి.
ఇక పులి సంచారం ఉన్న చోట్ల వేటగాళ్ల నిరోధం, ముప్పు తప్పించేందుకు అటవీ అధికారులు శ్రమించాల్సి వస్తోంది. ప్రతీ ఏటా పులులు ఏదో కారణంగా ఇక్కడ మృత్యువాత పడుతున్నాయి. విద్యుత్ కంచెలు, వేటతో ప్రమాదంలో పడుతున్నాయి. కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పులులు ప్రాణాలు కోల్పోయాయి. క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా లోపం ఏర్పడుతోంది. పులుల సంరక్షణ కోసమే దళం ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో పులుల సంతతి పెంపునకు ఉపయోగపడనుంది.

రాష్ట్రంలో పులుల రక్షణకు చర్యలు