
మన్సూర్ ఖాన్ (Mansoor Khan).. ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వోహి సికందర్ వంట కల్ట్ క్లాసిక్స్ అందించిన గొప్ప డైరెక్టర్. 2000వ సంవత్సరంలో వచ్చిన జోష్ తర్వాత మళ్లీ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించనేలేదు. కూనూర్ వెళ్లి అక్కడే పొలం పని చేసుకుంటున్నాడు. ఇటీవల ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లిన ఈయనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు చూద్దాం..
డైరెక్షన్‌పై ఆసక్తి లేదు
నేను సినీ ప్రేమికుడిని కాదు. కథలు చెప్పడం ఇష్టమే కానీ దర్శకుడిగా రాణించడం మాత్రం అస్సలు ఇష్టం లేదు. 99శాతం సినిమాలు నేను చూడనేలేదు. కథలు రాయడం ఇష్టం కాబట్టి రెండు పుస్తకాలు కూడా రాశాను. మూడోది రాస్తున్నాను. అయితే రెండో పుస్తకాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన ఉంది. ఆమిర్ ఖాన్ (Aamir Khan)కు ఆ బుక్ చాలా నచ్చింది. దాన్ని సినిమాగా తీసుకురావాలన్న తపన నాకంటే అతడికే ఎక్కువగా ఉంది. అన్నీ కుదిరితే ఆ మూవీలో ఆమిర్ ఖానే హీరోగా నటిస్తాడు.
ఫెయిల్యూర్ పార్టీ..
అతడి ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు దగ్గరివాళ్లని పిలిచి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాడు. అందులో నేనూ ఉంటాను. లాల్ సింగ్ చద్దా సినిమా చూసినప్పుడు నాకంతగా నచ్చలేదు. తన హావభావాలు కాస్త ఎక్కువైనట్లుగా అనిపించింది. పీకే మేనరిజానికి దగ్గరగా అతడి యాక్టింగ్ ఉంది. అది ఆమిర్ కూడా పసిగట్టాడు. ఆ సినిమాకు నేనే డైరెక్టర్ అయ్యుంటే అతడిని అలా చేయనిచ్చేవాడినే కాదు! సాధారణంగా అందరూ సినిమా సక్సెస్ అయ్యాక పార్టీ చేసుకుంటారు. కానీ ఆమిర్ ఫ్లాప్ అయ్యాక పార్టీ ఇస్తాడు. ఫెయిల్యూర్‌కు తనే బాధ్యత వహిస్తాడు.
తండ్రి కంటే కొడుకే బాగా..
నిజానికి లాల్ సింగ్ చద్దాలో మొదట ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ (Junaid Khan)ను తీసుకుందామనుకున్నారు. అది మంచి ఛాయిస్ అని చెప్పాను. ఎందుకంటే అతడి వయసు 28. ఆ వయసులో వారి ముఖంలో ఒకరకమైన అమాయకత్వం కనిపిస్తుంది. గొప్ప గొప్ప నటుల్లో కూడా అది గోచరించదు. ఈ సినిమాకు అతడే మంచి ఛాయిస్ అని చెప్పాను. అలాగైతే సినిమాకు ఓపెనింగ్స్ కూడా రావని దర్శకనిర్మాతలు వెనకడుగు వేశారట. ఇంత చెత్తగా ఆలోచిస్తున్నారేంటనుకున్నాను. వారి వల్ల చివరకు ఆమిర్ చేయక తప్పలేదు అని మన్సూర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం