ఆప్‌ ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంది | AAP Used Delhi As Political ATM says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆప్‌ ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంది

Published Sat, Feb 1 2025 5:28 AM | Last Updated on Sat, Feb 1 2025 5:28 AM

AAP Used Delhi As Political ATM says PM Narendra Modi

రాజధానిని రాజకీయ ఏటీఎంలా వాడుకుంటోంది

 ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధిని ఆప్‌ అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పురోగతి కోసం ఢిల్లీని రాజకీయ ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. మోదీ శుక్రవారం నాడిక్కడ ద్వారకలో ప్రచారసభలో మాట్లాడారు. ఢిల్లీ పురోభివృద్ధి కోసం డబుల్‌ ఇంజిన్‌ సర్కారును ఎన్నుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. అధునాతన ఢిల్లీకి బీజేపీ కట్టుబడి ఉందనడానికి ఇటీవల ప్రారంభించిన యశో­భూమి కన్వెన్షన్‌ సెంటర్‌ ఉదాహరణ అన్నారు. 

వేరే రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆప్‌ ఢిల్లీ వనరులను ఖాళీ చేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎం కార్డు లాగా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ రాజకుటుంబం గిరిజన రాష్ట్రపతిని అవమానించిందన్నారు. ఆప్‌ ప్రభుత్వం తమ సమయమంతా ఇతర రాష్ట్రాలతో పేచీలకే వెచి్చస్తోందని మండిపడ్డారు. కేంద్రంతోనూ, ఉత్తరప్రదేశ్, హరియాణాలతో నిత్యం కలహిస్తోందన్నారు. దాంతో ఢిల్లీ అభివృద్ధి కుంటుపడుతోంద­న్నారు. 

ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఢిల్లీ వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలలో మునిగితేలే ప్రభుత్వం కంటే సమన్వయంతో ముందుకు సాగే ప్రభుత్వం ఢిల్లీకి అవసరమన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూసే ప్రభుత్వం కావాలన్నారు. బీజేపీని గెలిపిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. 

అన్నా హజారే ఉద్యమాన్ని అపహస్యం చేస్తూ ఆప్‌ సర్కార్‌ అవినీతిలో మునిగిపోయిందని, ప్రజలకు ద్రోహం చేసిందని మోదీ అన్నారు. ఢిల్లీ బడ్జెట్‌లో ఆప్‌ 20 శాతమే అభివృద్ధిపై ఖర్చు పెడుతోందని, మౌలికసదుపాయాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా సొంత ప్రచారానికి నిధులు వెచి్చస్తోందని పేర్కొన్నారు. అద్దాల మేడలో నివసించే వాళ్లు పేదల ఇళ్ల గురించి పట్టించుకోరని, ఆప్‌ మధ్యతరగతికి వ్యతిరేకమని మోదీ అన్నారు.  

ఆప్‌ అక్రమాలను తవ్వితీస్తాం 
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆప్‌ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాగ్‌ నివేదికను ఢిల్లీ సర్కారు తొక్కిపెట్టాలని చూసిందని ఆరోపించారు. మద్యం పాలసీతో సహా ఆప్‌ విధానాలను కాగ్‌ తప్పుపట్టిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కాగ్‌ నివేదికను ప్రవేశపెడతామని మోదీ అన్నారు.

ఢిల్లీ అభివృద్ధికి శాయశక్తులా బీజేపీ సర్కారు కృషి చేస్తుందన్నారు. దోపిడి, అబద్ధాల నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తన కల అని, ఆప్‌ దీనిని అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా ఆప్‌ అడ్డుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందేలా చూస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement