
48 గంటలకోసారి వైద్య పరీక్షలు జరిపించాలన్న కోర్టు
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా(64)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)అధికారులు రోజులో 8 నుంచి 10గంటలపాటు ప్రశ్నిస్తున్నారు. పేలుళ్ల వెనుక కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. 2008 నవంబర్ 26వ తేదీన దాడులకు ముందు అతడు దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన పర్యటనల వెనుక ఉద్దేశాన్ని కనుగొనే దిశగా విచారణ సాగుతోందన్నారు.
ఈ నెల 10న అమెరికా నుంచి తీసుకు వచ్చిన రాణాను ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతించడం తెల్సిందే. రాణాకు ఆరోగ్య పరీక్షలు చేయించడంతోపాటు లాయర్‌ను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన విచారణాధికారి జయా రాయ్ సారథ్యంలో విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారులకు రాణా సహకరిస్తున్నాడని ఓ అధికారి వెల్లడించారు.
రాణా కోరిన మేరకు పెన్, నోట్ ప్యాడ్, ఖురాన్‌ను సమకూర్చామన్నారు. ఇతర నిందితులకు మాదిరిగానే ఆహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా ఏదీ అతడు కోరలేదన్నారు. రాణా ప్రస్తుతం ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో అత్యంత భద్రత కలిగిన సెల్‌లో ఉన్నాడు. కుట్ర, హత్య, ఉగ్రకార్యకలాపాలకు ఊతమివ్వడం, ఫోర్జరీ తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీకి చెందిన పలువురు ఉగ్ర నేతల ప్రమేయం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
ఢిల్లీలోనూ దాడులకు కుట్ర
2008 నవంబర్ 26వ తేదీన ముంబై ఉగ్రదాడులకు పథకం రచన చేసిన తహవ్వుర్ రాణా అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలోనూ మారణ హోమం సృష్టించేందుకు పథకం వేసినట్లు వెల్లడైంది. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఈ నెల 10వ తేదీన జారీ చేసిన 10 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘దేశమంతటా విస్తృతంగా పర్యటన చేసిన రాణా పలు నగరాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇందులో ఢిల్లీ కూడా ఉన్నట్లు ఎన్‌ఐఏ ఆధారాలున్నాయి.
జాతీ భద్రతకు సంబంధించిన విషయం ఇది. దీని వెనుక ఉన్న భారీ కుట్రకోణాన్ని ఛేదించేందుకు రాణా కస్టోడియల్ విచారణ అవసరం. సాకు‡్ష్యల విచారణ, ఆధారాల సేకరణ, రాణా అతడి అనుయాయుల పర్యటనల వివరాలను రాబట్టాల్సి ఉంది. 17 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలపై రాణాను పలు కీలక ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది’అని అందులో పేర్కొన్నారు. అనేక ఆరోగ్య సమస్యలున్న రాణాకు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన ఆదేశించారు.