
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది.