
పలు ప్రాజెక్టులను ప్రారంభించిన రాజ్‌నాథ్
కర్వార్ (కర్నాటక): వ్యూహాత్మకంగా కీలకమైన కర్నాటకలోని కర్వార్ నేవీ బేస్‌లో శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇండియన్ ఓషన్ షిప్ ఐవోఎస్ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్)ను జెండా ఊపి జల ప్రవేశం చేయించారు. దీంతోపాటు ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మిలటరీ హెలికాప్టర్‌లో కర్వార్‌కు చేరుకున్న రాజ్‌నాథ్ ‘సీబర్డ్’లో భాగమైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారని రక్షణ శాఖ తెలిపింది.
జల ప్రవేశం చేయించిన ఐవోఎస్ సాగర్‌లో 9 దేశాల నావికా దళాలకు చెందిన 44 మంది సిబ్బంది ఉంటారని పేర్కొంది. హిందూ మహా సముద్ర ప్రాంత భవిష్యత్తును నిర్ణయించడంలో ఐవోఎస్ సాగర్ కీలకంగా మారనుందని రక్షణ శాఖ ‘ఎక్స్’లో తెలిపింది. ఈ ప్రాంత దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్‌కు ఇది ఎంతో సాయపడుతుందని తెలిపింది. సీబర్డ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విస్తరణ పనులతో కర్వార్ నేవీ బేస్‌లో 32 యుద్ద నౌకలు, సబ్‌మెరీన్లను నిలిపేందుకు అవకాశమేర్పడింది.