
న్యూఢిల్లీ: ఈసారి ఎండల భగభగ తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు సాధారణానికి మించిన తీవ్రతతో ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతం మైదాన ప్రాంతాల్లో వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగే అవకాశముందని కూడా అంచనా వేసింది.
తూర్పు, పశ్చిమ భారతం మినహా దేశంలోని మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఈసారి సాధారణ గరిష్ట స్థాయికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ భారత్‌లో సాధారణ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయంది. అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగతలు సైతం సాధారణ స్థాయికి మించి ఉండే అవకాశముందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో వివరించారు.
‘ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర, తూర్పు, మధ్య భారతదేశం, వాయవ్య భారతంలోని మైదాన ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు అధికంగానే వడగాడ్పులు వీచే అవకాశముంది. మామూలుగా, ఈ కాలంలో నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే వడగాడ్పులు వీస్తుంటాయి’అని ఆయన తెలిపారు. వడగాడ్పుల తీవ్రత తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రాజస్తాన్, గుజరాత్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు కర్ణాటక తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది.