
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాశివరాత్రి వేడుకలతో మహాకుంభమేళా(Mahakumbh Mela) పరిసమాప్తమయ్యింది. శివరాత్రి రోజున ఆఖరి పవిత్ర స్నానాలు కావడంతో లెక్కలేనంతమంది భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో మొత్తం 66 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా మౌని అమావాస్య నాటి రద్దీని చూసి, ఆనాడు వెనుదిరిగిన బీహార్‌కు చెందిన ఒక కుటుంబం తిరిగి శివరాత్రి నాడు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మహాకుంభమేళాకు వచ్చింది. వీరు మౌని అమావాస్య రోజున జరిగిన విషాదాన్ని మీడియాకు వివరించారు.
బీహార్(Bihar)లోని బక్సర్‌లో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులలో ఒకరైన మహిళ మీడియాతో మాట్లాడుతూ మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో జనసమూహాన్ని చూసి, ఇక స్నానాలు చేయలేమని భావించి నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టామన్నారు. ఇప్పుడు శివరాత్రి వేళ పుణ్యస్నానాలు ఆచరించేందుకు తిరిగి వచ్చామన్నారు. అదే కుంటుంబానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ మౌని అమావాస్యనాడు విషాద ఘటన సంగమ్ నోస్ వద్ద జరగిందని అన్నారు. ఆ రోజున జనం ఎటువైపు వెళుతున్నామో తెలియనంతగా పరిగెట్టారన్నారు. దీనిని చూసిన మా అంటీ భయంతో రోదించసాగారని, దీంతో నేను ఆమెను ఇక్కడి నుంచి పంపించేందుకు ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వరకూ దిగబెట్టానని అన్నారు.
ఇదే కుటుంబానికి చెందిన మరో మహిళ మాట్లాడుతూ ఆరోజున తొక్కిసలాట(Stampede) ఎంతగా జరిగిందంటే ఒకరిమీదకు మరొకరు ఎక్కిపోయారన్నారు. అలాగే అందరూ ఒకవైపుగా తోసుకుంటూ పరిగెట్టారని, అక్కడి పరిస్థితి చూసి తామంతా భయపడిపోయామని, పుణ్య స్నానాలు చేయకుండానే వెనుదిరిగామన్నారు. ఆరోజు 25 మంది వరకూ మృతి చెందడాన్ని చూశానని, తనను ఆ గుంపు నుంచి పోలీసులు కాపాడారని, ఊపిరి ఆడని స్థితిలో తనకు ఆక్సిజన్ అందించారని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటంతో తాము ఎంతో సంతృప్తికరంగా పుణ్య స్నానాలు చేశామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి