
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్‌లో కలుసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) సానుకూల వైఖరి అవలంబించిన నేపథ్యంలోనే వీరిద్దరు కలుసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కోరిక మేరకు తులిప్ గార్డెన్‌కు వెళ్లిన ఒమర్‌కు అనూహ్యంగా అదే రోజు ఉదయం గార్డెన్‌కు వచ్చిన మంత్రి రిజిజు కలిశారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది.
యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం ఎవరికి వారు వెళ్లిపోయారని చెబుతోంది. ఇదంతా కేవలం అనుకోకుండా జరిగిన పరిణామమని, దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అయితే, రిజిజు ‘ఎక్స్’లో అబ్దుల్లాలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం వివాదాన్ని రేపింది. వక్ఫ్ సవరణ చట్టంపై బీజేపీకి ఎన్‌సీకి లొంగిపోయిందని ప్రతిపక్ష పీడీపీ ఆరోపించింది. పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజుకు తులిప్ గార్డెన్‌లో ఎన్‌సీ ఎర్ర తివాచీ పరిచిందని మరో నేత అన్నారు. సీఎం ఒమర్ తులిప్ గార్డెన్‌లో తారసపడిన కేంద్ర మంత్రి రిజిజుకు కనీసం దూరంగా ఉండటం ద్వారా నిరసన తెలిపి ఉండాల్సిందని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోనె పేర్కొన్నారు.