
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వేర్పాటువాదం తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్ (ఏపీహెచ్‌సీ)కి చెందిన మరో భాగస్వామ్య సంస్థ ‘జమ్ముకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్(Jammu and Kashmir Mass Movement)’ (జేకేఎంఎం) విద్రోహవాద, వేర్పాటువాద భావజాలానికి స్వస్తి పలికి, హురియత్‌తో సంబంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇటీవలి కాలంలో హురియత్ నుంచి విడిపోయిన 12వ సంస్థగా ఏపీహెచ్‌సీ నిలిచింది. దీనిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) స్వాగతించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావజాలంలోని ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ దిశగా సాగిన ఒక విజయంగా అభివర్ణించారు. జమ్ముకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ (జేకేఎంఎం)చైర్‌పర్సన్ ఫరీదా బేహన్ ఒక బహిరంగ ప్రకటనలో తమ సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌లోని రెండు వర్గాలతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. హురియత్ భావజాలం జమ్ముకశ్మీర్ ప్రజల ఆకాంక్షలను పరిష్కరించడంలో విఫలమైందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జేకేఎంఎం ఇకపై భారత రాజ్యాంగానికి కట్టుబడి దేశ ఐక్యతకు పాటుపడుతున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జేకేఎంఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ‘ఎక్స్’ పోస్టులో ఇలా పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వం హయాంలో జమ్ముకశ్మీర్‌లో ఐక్యతా స్ఫూర్తి నడుస్తోంది. హురియత్‌తో అనుబంధం ఉన్న మరో సంస్థ జమ్ముకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ విద్రోహవాదాన్ని తిరస్కరించి, భారత ఐక్యతకు పూర్తి కట్టుబాటును ప్రకటించింది. వారి చర్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు 12 హురియత్ అనుబంధ సంస్థలు(12 Hurriyat affiliates) వేర్పాటువాదాన్ని వీడి భారత రాజ్యాంగంపై నమ్మకాన్ని ప్రకటించాయి.
2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, జమ్ముకశ్మీర్‌లో విద్రోహవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, శాంతి, అభివృద్ధి దిశగా రాష్ట్రం పురోగమిస్తోందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. 1993లో ఏర్పాటైన హురియత్ కాన్ఫరెన్స్ జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద, విద్రోహవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వస్తోంది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ ప్రభావం గణనీయంగా తగ్గింది. దీనిలో భాగస్వాములుగా ఉన్న 12 సంస్థలు వీడటం ఈ సంస్థ బలహీనపడటాన్ని తెలియజేస్తుంది. దీనికి జమ్ముకశ్మీరలో ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ విధానాలే కారణమని హోమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..