
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు.
ధన్‌ఖడ్‌కు మద్దతు ప్రకటిస్తూ ముర్ము బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంపీల ప్రవర్తనను చూసి కలత చెందానని పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను ఎంపీలంతా కాపాడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రపతికి ధన్‌ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు. అవమానాలు, హేళనలు తన మార్గం తనను నుంచి తప్పించలేవన్నారు.
ధన్‌ఖడ్‌కు మోదీ ఫోన్
ధన్‌ఖడ్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. విపక్ష సభ్యుల ప్రవర్తన చాలా బాధ కలిగించిందన్నారు. విపక్ష సభ్యులు మిమిక్రీ చేయడాన్ని మోదీ ఆక్షేపించారు. ఎవరు ఎన్ని విధాలుగా హేళన చేసినా తన విధులు తాను నిర్వరిస్తూనే ఉంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరని మోదీతో ధన్‌ఖడ్ చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఇలాంటి హేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని మోదీ చెప్పారంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎన్డీయే ఎంపీలు కూయాయనకు మద్దతు ప్రకటించారు. సంఘీభావంగా బుధవారం లోకసభలో 10 నిమిషాలపాటు లేచి నిల్చున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ధన్‌ఖఢ్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ధన్‌ఖడ్ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. పార్లమెంట్‌ను, ఉప రాష్ట్రపతి పదవిని అవమానిస్తే సహించబోనని హెచ్చరించారు. మిమిక్రీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎవరినీ కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు. ఉప రాష్ట్రపతిని అవమానించలేదని చెప్పారు.
బీజేపీ ఎంపీపై చర్యలేవి: కాంగ్రెస్
జాట్ కులాన్ని ప్రతిపక్షాలు అవమానించాయన్న ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. పార్లమెంట్‌లో తనను ఎన్నోసార్లు మాట్లాడనివ్వలేదని, దళితుడిని కాబట్టే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తాను అనొచ్చా అని ప్రశ్నించారు. మోదీ గతంలో అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీని మిమిక్రీ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ గుర్తు చేశారు.