
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. బీహార్‌లోని కరకట్ లోక్‌సభ స్థానంలో విచిత్ర రాజకీయ వాతావరణం కనిపించింది.
ఈ సీటు నుంచి భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఇంతలోనే అతని తల్లి తల్లి ప్రతిమా దేవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి, అనంతరం ఉపసంహరించుకున్నారు. మరోవైపు పవన్ సింగ్ ఎన్నికల ప్రచారంతో ప్రజల మధ్యకు వెళుతున్నారు.
పవన్ సింగ్ తల్లి నామినేషన్ ఉపసంహరణ వెనుక ఒక వాదన వినిపిస్తోంది. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా బీజేపీ కూటమి తరపున కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్‌కు కూడా బీజేపీతో అనుబంధం ఉంది. దీంతో అతనిపై నామినేషన్ ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి వచ్చిందని సమాచారం. దానిని పట్టించుకోకుండా పవన్ సింగ్ కరకట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల బరిలోకి దిగారు. కుమారునికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే అతని తల్లి నామినేషన్ దాఖలు చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ తరువాత ఆమె తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
దీనికి ముందు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ పవన్ సింగ్‌కు కేటాయించింది. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు నిరాకరించారు. అనంతరం తాను కరకట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పవన్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. ప్రతిమాదేవి నామినేషన్ ఉపసంహరణను ఎన్నికల సంఘం ధృవీకరించింది. ఆమె మే 14న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ సింగ్ తన నామినేషన్ తిరస్కరణకు గురవుతుందనే అనుమానంతోనే తన తల్లి ప్రతిమా దేవి చేత నామినేషన్ దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. జూన్ ఒకటిన కరకట్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.