
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ చేపట్టన సర్వే అంతా బోగస్ అని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish Reddy ఆరోపించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్ ఉందని, ఇప్పుడు చేపట్టిన సర్వే బోగస్ అని తాను అనడం కాదని కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శిస్తున్న విషయాన్ని రేవంత్ తెలుసుకోవాలన్నారు. సూర్యాపేటలో ప్రెస్‌మీట్ నిర్వహించిన జగదీష్‌రెడ్డి.. రాష్ట్రంలో పాలన కుక్కల చించిన విస్తరిలా ఉందన్నారు. జనాభాను తగ్గించి చూపితే మన రాష్ట్రానికి నష్టమనే సోయిలేదా? అని విమర్శించారు.
‘కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. కొంతమంది అనామకులు మేమున్నామని చెప్పుకోవడానికే అప్పుడప్పుడు మొరుగుతున్నారు. సీఐడీ కాదు అంతకంటే పెద్దది సీఐఏ తో ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అంటూ జరిగితే ముందుగా జైలుకు పోయేది రేవంతే. గుమ్మడికాయ దొంగలేవరంటే కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. లక్ష డప్పులు.. వేల గొంతుల కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికే అసెంబ్లీ పెట్టారు.ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను పూర్తిగా అమలుచేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.