పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్‌ | CM Revanth Reddy Says We will win next elections with women votes | Sakshi
Sakshi News home page

పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్‌

Published Thu, Dec 5 2024 4:44 AM | Last Updated on Thu, Dec 5 2024 4:44 AM

CM Revanth Reddy Says We will win next elections with women votes

బుధవారం పెద్దపల్లి బహిరంగ సభకు హాజరైన జనానికి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ, సోలార్‌ సహా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తాం

రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే గెలుస్తాం: రేవంత్‌

రామగుండం, కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు కడతాం

పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబానికే కొలువులు దక్కాయి

మేం ఏడాదిలోనే 55,143 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాం

కాళేశ్వరం నుంచి చుక్క నీరెత్తకుండానే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశాం

రుణమాఫీపై మోదీ, బండి, కిషన్‌రెడ్డి చర్చకు రావాలని సీఎం సవాల్‌

పెద్దపల్లిలో యువ వికాసం సభ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ, సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటిమందిని కోటీశ్వరు లుగా మార్చేవరకు తాము విశ్రమించబోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామన్నారు. గత పదేళ్లకాలంలో ఒక్క విమానాశ్రయం కట్టలేదని, కానీ తాము రామగుండం, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ విమానాశ్రయాలను కడతామని తెలిపారు. 

గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదు కానీ, కేసీఆర్‌ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. తమ ఇందిరమ్మ పాలనలో ఏడాదిలోనే 55,143 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇదే వేదికపై 8,084 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్‌ 10 వరకు తాము చేసిన పనులన్నీ చెప్పుకుంటామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని, దీనిపై ప్రధాన మోదీ, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్‌ చేశారు. 

కేటీఆర్, హరీశ్‌లను అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలోకి కేసీఆర్‌ వదిలిండని, తెల్లారిలేస్తే సోషల్‌ మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువవికాసం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

బలమైన కుర్రాడు ఒక్క రోజులో పిల్లాడిని కనలేడుగా..
‘రూ.లక్ష కోట్లు వెచ్చించి కేసీఆర్‌ కాళేశ్వరం కడితే కూలింది. మేం 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులేవీ చెక్కు చెదరలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండింది. అందులో పెద్దపల్లి అగ్రగామిగా నిలిచింది. గతంలో వర్సిటీలు నిరాదరణకు గురయ్యాయి. మేం 10 వర్సిటీలకు వీసీలను నియమించాం. శాతవాహన వర్సిటీకి లా, ఇంజనీరింగ్‌ కాలేజీలు మంజూరు చేస్తున్నాం. డీఎస్సీ పిలిచి 11 వేల టీచర్‌ కొలువులిచ్చాం. 

చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందిరా పార్కు వద్ద మూసేసిన ధర్నా చౌక్‌ తెరిపించాం. మా ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్‌ ముళ్ల కంచెను తొలగించాం. ప్రగతిభవన్‌లో ప్రతివారం చిన్నారెడ్డి ప్రజల ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారు. పేద పిల్లలకు 40% కాస్మెటిక్, డైట్‌ చార్జీలు పెంచాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యను పరిష్కరించుకుంటాం. ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది. బలమైన కుర్రాడికి పెళ్లి చేసినంత మాత్రాన.. ఒక్కరోజులో పిల్లాడిని కనలేడుగా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పదేళ్లలో ఉద్యాగాలెందుకు ఇవ్వలేదు? 
‘కవితమ్మ ఎంపీగా ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. సంతోష్‌కు రాజ్యసభ, ఎంపీ ఎ్ననికల్లో ఓడిన వినోద్‌కు ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ ఇచ్చారు. అదే పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదు. ఇందుకోసమేనా తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసింది? కొలువుల్లేక దాదాపు 35 లక్షల మంది ఉపాధి కూలీలుగా, అడ్డా కూలీలుగా మారారు. వందలాది బలిదానాలు, లక్షలాదిమంది కేసులు ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? 80 వేల పుస్తకాలు చదివిన మీకు నిరుద్యోగుల కష్టం అర్థం కాలేదా? అందుకే మేం ఆలోచన చేసి 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువ వికాసం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..’ అని సీఎం పేర్కొన్నారు. 

కొందరు విష ప్రచారం చేస్తున్నారు..
‘పెద్దపల్లి జిల్లా ప్రజల వెన్నుదన్నుల వల్లే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్‌ పదేళ్ల కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం తనలా ఎకరానికి రూ.కోటి ఆదాయం ఎలా తీయాలో నేర్పలేదు. నాడు ఎస్సారెస్పీ నీటి కోసం అరెస్టయిన విజయరమణారావు కల నేడు ఫలించింది. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు రూ.1,030 కోట్లతో ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ పనులు, ఆర్టీసీ డిపో వచ్చాయంటే అందుకు కారణం మీ అభిమాన విజ్జన్న, శ్రీధర్‌బాబులే. 

వాస్తవానికి ఈ పనులు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని అడగలేదు..బెదిరించారు (నవ్వులు). తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి కరీంనగర్, ఆదిలాబాద్‌కు నీరిస్తాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. కొందరు తమకు భవిష్యత్తు లేదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే విష ప్రచారాన్ని డిసెంబరు 10 వరకు తిప్పికొట్టి చరిత్ర తిరగరాస్తాం. నరేంద్ర మోదీ 14 ఏళ్లు గుజరాత్‌ సీఎంగా ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు. గుజరాత్‌లో తొలి ఏడాదిలో  55వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు సిద్ధమా? మోదీకి ప్రత్యేక విమానం పెడతాం. సచివాలయంలో చర్చ పెడతాం..’ అని సీఎం సవాల్‌ చేశారు. 

మద్దతు ధర, బోనస్‌ ఇస్తున్నాం..
‘రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. 66 లక్షల ఎకర్లాలో 1.53 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాధ్యమైంది. ఆనాడు ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్‌ చెప్పారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో మద్దతు ధరతో పాటు బోనస్‌ ఇస్తున్నాం. రైతుబంధు రూ.7,625 కోట్లు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీతో ఈ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. గుజరాత్‌లో రైతు రుణమాఫీ చేశారా? చర్చకు సిద్ధమేనా?..’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

కులగణనలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనడం లేదు?
‘రాహుల్‌గాంధీ పిలుపుతో కులగుణన చేపట్టాం. 95 శాతం పూర్తి చేశాం. కులగణనలో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనడం లేదు? బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే.. కేసీఆర్‌ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదా? బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement