
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు, ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించనుంది. ఇద్దరు రెడ్లు, ఒక బీసీ,ఒక ఎస్సీ సామాజిక వర్గం నేతకు అవకాశం కల్పించనుండగా.. చీప్ విప్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం నేతకు కట్టబెట్టేయోచనలో అధిష్టానం నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ప్రస్తుతం మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. అయితే, అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపితే వారికే మంత్రి పదవి ఖాయం. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక, కేబినెట్ విస్తరణపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు సేకరించింది. ఆ వివరాల ఆధారంగా మంత్రి పదవులు కేటాయింపు ఉంటుంది.