
వారి మద్దతుతోనే మోదీ ఈ నల్లచట్టాన్ని తెచ్చారు
చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు?
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తోంది
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్‌లో భారీ సభ
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంపూర్ణ సహకారంతోనే ప్రధాని నరేంద్రమోదీ వక్ఫ్ నల్ల చట్టాన్ని తీసుకురాగలిగారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్యులుగా చేర్చే బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతిచ్చి.. తన కుమారుడు లోకేశ్ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. భవిష్యత్‌లో ముస్లింలు చంద్రబాబు వారసులను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.
వక్ఫ్ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 29లలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అసదుద్దీన్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ముస్లింల హక్కులన్నింటినీ లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.
వక్ఫ్‌పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. హిందు, జైన, సిక్కు ఎండోమెంట్ బోర్డులలో ఆ మత విశ్వాసాలను అనుసరించే వారు మాత్రమే సభ్యులుగా ఉంటారని, అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండటం సబబా? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని వక్స్ భూములను ఆక్రమించిన వారికే వాటిని కట్టబెట్టే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు.
సవరణకు వ్యతిరేకంగా సభ
వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 19న దారుస్సలాంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షత జరిగే ఈ సభకు దేశవ్యాప్తంగా మత పెద్దలు, పలువురు రాజకీయ నేతలు హాజరవుతారని చెప్పారు. వక్ఫ్ చట్ట వ్యతిరేక నిరసనలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.