
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై పక్షం రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్
యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు. అయితే ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీ సీ పెద్దలతో షబ్బీర్ అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. చదవండి: ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న షబ్బీర్‌అలీకి జిల్లా అంతటా అనుచరులున్నారు. అయితే ఇటీవలి కాలంలో కామారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కాగా మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.