
సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడు పర్యటనతో మనసు పులకించిందని, ప్రతి కార్యకర్త, ప్రజల ఆకాంక్ష నెర వేరే రోజులు సమీపించాయని చిన్నమ్మ శశికళ ధీమా వ్యక్తం చేశారు. మదురై నుంచి ఆమె రోడ్డు మార్గంలో సోమవారం చెన్నైకు చేరుకున్నారు. రెండు రోజుల క్రితం తూత్తుకుడిలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పర్యటించారు.
ఆ తదుపరి తిరునల్వేలి, తెన్‌కాశి, విరుదునగర్, మదురైలలో చిన్నమ్మ పర్యటన రోడ్డు మార్గంలో సాగింది. ఈ పర్యటల్ని ముగించుకుని చెన్నైకు చేరుకున్న శశికళ కేడర్‌ను ఉద్దేశించి ప్రకటన చేశారు. తాను ఆధ్యాత్మిక పర్యటన నిమిత్తం వెళ్లినా, చివరకు ప్రజలతో, అభిమానులతో మమేకమయ్యారు.
రోడ్డు మార్గంలో చెన్నైకు రాక
అందరినీ కలవాలనే ఆకాంక్షతోనే విమాన ప్రయానాన్ని సైతం రద్దు చేసుకుని రోడ్డు మార్గంలో చెన్నైకు వచ్చినట్టు గుర్తు చేశారు. ఎంజీఆర్, జయలలిత ఆశయ సాధన ప్రతి కార్యకర్త కళ్లల్లో తనకు ఈ పర్యటన ద్వారా కనిపించిందన్నారు. అందరి ఆకాంక్ష, కోరిక నెరవేరే రోజులు సమీపించాయని వ్యాఖ్యానించారు.
అందరం ఐక్యమత్యంగా ముందుకెళ్దామని, దివంగత నేతల ఆశయ సాధనలో భాగస్వామ్యం అవుదామని, పార్టీని పరిరక్షించి, ప్రజా పాలనను తిరిగి సాధించుకుంద్దామని చిన్నమ్మ ధీమా వ్యక్తం చేశారు. తన పూర్తి జీవితాన్ని ప్రజలు, కేడర్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.