
నెల్లూరు: శాసనమండలిలో తమకు సమాధానం చెప్పలేక మంత్రులు తోకముడిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మండలిలో అడుడగడునా ఎండగట్టాం.
మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పారు. బీసీల బలవంతపు రాజీనామాలపై సుదీర్ఘంగా చర్చించకుండా లోకేష్ తోకముడిచారు. గత ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం పెట్టి.. ఇప్పటివరకూ దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గత ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేస్తోంది.
వైఎస్సార్‌సీపీలో ఉండే ఏ ఒక్కరికి రాజకీయ స్వార్థం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడమే మా అందరి లక్ష్యం. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసినా.. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు’ అని ధ్వజమెత్తారు.