బలవంతపు వాంగ్మూలంతో కాకాణిపై అక్రమ కేసు: పర్వతరెడ్డి | Ysrcp Mlc Parvatha Reddy Slams Coalition Illegal Cases Against Kakani | Sakshi
Sakshi News home page

బలవంతపు వాంగ్మూలంతో కాకాణిపై అక్రమ కేసు: పర్వతరెడ్డి

Published Tue, Apr 1 2025 5:21 PM | Last Updated on Tue, Apr 1 2025 5:26 PM

Ysrcp Mlc Parvatha Reddy Slams Coalition Illegal Cases Against Kakani

టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.

సాక్షి, నెల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్టగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉగాది పండగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లినప్పుడు, కావాలనే ఆయన ఇంటికి నోటీసు అంటించి మర్నాడే విచారణకు రమ్మనడం అత్యంత హేయమని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

నెల్లూరులో ఎప్పుడూ చూడని వికృత రాజకీయం:
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా సీనియర్‌ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయాలు చూసి అన్ని వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలని కూటమి ప్రభుత్వం ఈ వికృత రాజకీయాలకు పాల్పడుతోంది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, వారి ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే ఓర్చుకోలేక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కాకాణి గోవర్దన్‌రెడ్డి కుటుంబం దశాబ్ధాలుగా నెల్లూరు రాజకీయాల్లో ఉంటోంది. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం టార్గెట్‌ చేసి అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.

మూడు నెలలుగా ప్రయత్నం:
పొదలకూరు మండలంలో క్వార్ట్‌›్జ మైనింగ్‌లో మాజీ మంత్రి కాకాణిని ఎలాగైనా ఇరికించి జైల్లో నిర్బంధించాలనే కుట్రతో మూడు నెలలుగా ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. వారం క్రితం ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, అతన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. దాని ఆధారంగా కాకాణిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆయనకు బెయిల్‌ రాకుండా ఉండేందుకు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

దీనిపై కాకాణి గోవర్థన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో, ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ మీద విచారణ ఉన్న నేపథ్యంలో ఎక్కడ క్వాష్‌ అవుతుందోననే భయంతో ఆయనపై ఈరోజు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఇంకోపక్క గోవర్ధన్‌రెడ్డి రోజూ పార్టీ ఆఫీసుకే వసున్నా, పరారైపోయారని మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఏరోజుకారోజు ఈరోజే అరెస్ట్‌ చేస్తారని కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.

దురుద్దేశంతోనే నోటీసుల ప్రహసనం:
ఉగాది పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు కాకాణి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, కావాలనే పండగ రోజు, ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్లారు. నోటీస్‌ ఇచ్చే నెపంతో తాళాలు పగలగొట్టి, ఇంటి గోడలు దూకే ప్రయత్నం చేశారు. చివరికి ఇంటి గోడలకు నోటీస్‌ అంటించి, మర్నాడు (సోమవారం) ఉదయం విచారణకు హాజరు కావాలని అందులో నిర్దేశించారు.

నిజానికి శనివారం వరకు ఆయన ఇక్కడే ఉన్నా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులకు తీరిక లేదు. కావాలని పండగ రోజు ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే కుట్రతోనే హడావుడి చేసి వెళ్లారు. కాకాణి పారిపోయాడని ప్రచారం చేసుకుంటున్న కూటమి నాయకుల నోళ్లు మూయించడానికి ఆయన హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి పండగ చేసుకుంటున్న ఫొటోలను 7.30 గంటలకు అన్ని మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో హైదరాబాద్‌ వెళ్లిన పోలీసులతో బుధవారం తనకి వేర్వేరు పనులున్నాయని, గురువారం వస్తానని చెప్పినా వినుకోకుండా 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు.

నోటీసులు గురించి కాకాణిగారితో మాట్లాడినప్పుడు బుధవారం సాయంత్రానికి లేదా గురువారం ఉదయం కల్లా నెల్లూరులో అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు. కావాలంటే పోలీసులు గురువారం నెల్లూరు రావొచ్చని చెప్పారు. ఇలా అక్రమ కేసులు బనాయించి వైయస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవాలని చూడటం అవివేకమే అవుతుంది. కాగా, తాము ఇలాంటి  అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement