
మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య
తొగుట(దుబ్బాక): మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవికాంత్‌రావు కథనం మేరకు.. తొగుట గ్రామానికి చెందిన మేకల స్వామి (39) మద్యానికి బానిసయ్యా డు. భార్య లక్ష్మీ ఎన్నిమార్లు చెప్పినా వినిపించుకోకుండా రోజూ మద్యం సేవించేవాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఎదుట రేకుల గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చిరుత కలకలం
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. రైతు పిల్లుట్ల జాన్సన్ కథనం మేరకు.. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన తల్లి మంజులతో కలిసి పొలం నుంచి ఇంటికి వస్తుండగా జానకీసాగర్ కుంట వైపు వెళ్లే బ్రిడ్జి దగ్గర చెట్టు కింద చిరుత నిద్రిస్తుంది. బైక్ శబ్దం విని లేవడంతో తాము భయపడి వేగంగా ఇంటికి వచ్చామన్నారు. అనంతరం గ్రామస్తులకు విషయం చెప్పాం. అక్కడకు వెళ్లి చూడగా చిత్తడి నేలలో చిరుత అడు గులు పోలిన గుర్తులు కనిపించాయి. విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చెప్పడంతో అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచించినట్లు తెలిపారు. ఫారెస్ట్ వాచర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. తాము ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా అడుగుల గుర్తులు చిరుతను పోలి ఉన్నాయని చెప్పారు. పరిసరాలను గమనించగా అడవిలోని కొద్ది దూరంలో చిరుత కళ్లలా కనిపిస్తున్నాయని తెలిపారు. ఉదయం వరకు చిరుత అక్కడి నుంచి వెళ్లకుంటే బోనును ఏర్పాటు చేసి పట్టుకుంటామన్నారు.

మద్యం మత్తులో ఉరేసుకొని ఆత్మహత్య